Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికల సభలో కేంద్రరక్షణ మంత్రిని నిలదీసిన నిరుద్యోగులు
- 'డోన్ట్ వర్రీ'..'హోగీ హోగీ'.. అంటూ రాజ్‌నాథ్ సమాధానం
న్యూఢిల్లీ : ఎన్నికల ప్రచార సభల్లో బీజేపీ నాయకులకు గట్టి షాక్‌లు తగులుతున్నాయి. మొన్న..అమిత్ షాను రైతులు నిలదీయగా...నేడు రాజ్‌నాథ్‌సింగ్‌కు వ్యతిరేకంగా నిరుద్యోగ యువత ఆందోళనకు దిగింది. ఉద్యోగ నియామకాలేవంటూ ప్రశ్నించింది. రక్షణ మంత్రిగా ఉండి..ఆ శాఖలో ఆర్మీ రిక్రూట్మేంట్ చేపట్టడం లేదంటూ యువత ఆగ్రహం వ్యక్తం చేసింది. గోందా నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగిస్తుండగా నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో లేచి..నిరసన వ్యక్తం చేసింది. సైన్యంలో ఖాళీల భర్తీ చేయాలంటూ...నిరుద్యోగుల నినాదాలతో సభ హోరెత్తింది.
దాంతో రాజ్‌నాథ్ సింగ్ తన ప్రసంగాన్ని కొద్దిసేపు మధ్యలో ఆపేశారు. నినాదాలు చేస్తున్న నిరుద్యోగ యువతపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిరసన మరింత పెరగటంతో కాస్త వెనక్కి తగ్గి..వారిని ఊరడించే మాటలు చెప్పారు. 'డోన్ట్ వర్రీ..హోగీ..హోగీ..కరోనా సంక్షోభం కారణంగా కొన్ని అడ్డంకులు వచ్చాయి. మీ ఆందోళనను అర్థం చేసుకుంటున్నాను' అంటూ యువత ఆగ్రహాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత సభలో తన ప్రసంగాన్ని రాజ్‌నాథ్‌సింగ్ కొనసాగించారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే..హోలీ, దీపావళి పండగలకు ఉచిత వంటగ్యాస్ సిలిండర్ ఇస్తామని రాజ్‌నాథ్ సింగ్ ఓటర్లకు వాగ్దానం చేశారు.
ఇంటికో ఉద్యోగం..
యూపీలో అధికార బీజేపీకి నిరుద్యోగ యువత నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదురవుతోంది. అమిత్ షా..రాజ్‌నాథ్ సింగ్ వంటి పెద్ద పెద్ద నాయకులు వెళ్లిన చోట ఉద్యోగాల భర్తీపై ..యువత నిలదీస్తోంది. యోగి హయాంలో చేపట్టిన పలు ఉద్యోగ నియామకాల్లో అవకతవకలు జరగటంపైనా యువత తీవ్ర ఆగ్రహంతో ఉంది. వీటికి సమాధానం చెప్పుకోలేక బీజేపీ నాయకులు తంటాలు పడుతున్నారు. దాంతో బీజేపీ తన మ్యానిఫెస్టోలో ఉద్యోగ ఖాళీల భర్తీ చేపడతామని వాగ్దానం చేసింది. ఇంటికో ఉద్యోగం లేదా స్వయం ఉపాధి అవకాశం కల్పిస్తామని యోగి సర్కార్ చెబుతోంది. యోగి సర్కార్ వచ్చాక రాష్ట్రంలో నిరుద్యోగరేటు తగ్గిందని సోషల్‌మీడియాలో బీజేపీ మద్దతుదారులు తెగ ప్రచారం చేస్తున్నారు. అయితే ఇదంతా తప్పుడు ప్రచారమని తేలిపోయింది.
2017లో యోగి సర్కార్ రాకముందు యూపీలో నిరుద్యోగ రేటు 3.9శాతంగా ఉందని, ప్రస్తుతం (మార్చి-ఆగస్టు 2021)అది 4.9శాతానికి పెరిగిందని సీఎంఐఈ గణాంకాలు చెబుతున్నాయి. గతంతో పోల్చుకుంటే యువతలో నిరుద్యోగరేటు దాదాపు రెట్టింపు (14శాతం) అయ్యిందని సర్వే పేర్కొన్నది. నిరుద్యోగ సమస్య యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారింది.