Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహారాష్ట్ర సీఎంతో సమావేశం అనంతరం కేసీఆర్ బృందం.. ఎన్‌సీపీి అధినేత, కేంద్ర హోం శాఖ మాజీ మంత్రి శరద్ పవార్‌తో సౌత్ ముంబయిలోని ఆయన నివాసం సిల్వర్ ఓక్స్‌లో భేటీ అయింది. తాజా జాతీయ రాజకీయాలు, బీజేపీ విధానాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసిన పవార్.కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రారంభించాల్సిన కార్యచరణను కెసిఆర్‌కు ఆయన వివరించారు. బీజేపీ రెండోసారి కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత తీసుకున్న మూర్ఖపు నిర్ణయాల వల్ల దేశానికి తీవ్ర నష్టం జరిగిందని పవార్ అన్నారు. చివరకు వ్యవసాయం, రైతులను కూడా వదల్లేదని అసహనం వ్యక్తంచేశారు. సమావేశానంతరం ఇరువురు నేతలు కలిసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు శరద్ పవార్ సంపూర్ణ మద్దతు తెలిపారని గుర్తుచేస్తూ... రాష్ట్ర ప్రజల పక్షాన కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. జాతీయ స్థాయిలో భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామని పవార్ తెలిపారు. ఈ చర్చలు కేవలం ప్రారంభమేనని, త్వరలో మళ్లీ పలు దఫాలు నేతలందరితో చర్చించి దేశానికి మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకుంటామని కేసీఆర్ వివరించారు. కేసీఆర్ బృందంలో సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా ఉన్నారు