Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేషనల్ డిజిటల్ యూనివర్సిటీకి మహర్దశ
- విద్యా రంగంలో సీట్ల కొరతకు పరిష్కారం
- కేంద్ర బడ్జెట్ సానుకూల ప్రభావంపై వెబ్నార్లో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : జాతీయ విద్యా విధానం అమలు చేయడంలో కేంద్రబడ్జెట్ ఎంతగానో దోహదపడుతుందని ప్రధాని మోడీ అన్నారు. ప్రపంచ వ్యాప్త మహమ్మారి సమయంలో విద్యా వ్యవస్థను నడిపించేది డిజిటల్ కనెక్టివిటీ అని నొక్కి చెప్పారు. కేంద్ర బడ్జెట్ 2022-23 సానుకూల ప్రభావంపై వెబ్నార్లో ప్రధాని మోడీ సోమవారం మాట్లాడారు. జాతీయ విద్యా విధానాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో ఈ బడ్జెట్ ఉపయోగపడుతుందని వివరించారు. జాతీయ డిజిటల్ యూనివర్సిటీ ఏర్పాటు నిర్ణయంతో విద్యా రంగంలో సీట్ల కొరత సమస్యను పరిష్కరించవచ్చని ప్రధాని అన్నారు. నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్ధి, పట్టణ ప్రణాళిక, రూపకల్పన, అంతర్జాతీయీకరణ, యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ కామిక్ (ఏవీజీసీ) సార్వత్రికీకరణ, విద్యా రంగానికి సంబంధించిన ఐదు అంశాలపై బడ్జెట్ దృష్టి సారించిందన్నారు.
దేశంలో డిజిటల్ విభజన ఎంత వేగంగా తగ్గిపోతుందో మనం చూస్తున్నామని, ఇన్నోవేషన్ చుస్తున్నామని ఆయన అన్నారు. ఈ-విద్య, వన్ క్లాస్ వన్ ఛానల్, డిజిటల్ ల్యాబ్స్, డిజిటల్ యూనివర్సిటీ వంటి విద్యాపరమైన మౌలిక సదుపాయాలు యువతకు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. మాతృ భాషలో విద్య అనేది పిల్లల మానసిక వికాసానికి సంబంధించిందనీ, అనేక రాష్ట్రాల్లో వైద్య, సాంకేతిక విద్య స్థానిక భాషల్లో ప్రారంభమైందని ప్రధాని మోడీ అన్నారు. నేషనల్ డిజిటల్ యూనివర్సిటీ ఒక ప్రత్యేకమైన, అపూర్వమైన దశ అని మోడీ అన్నారు. ''మన దేశంలో మనం అనుభవిస్తున్న సీట్ల కొరత సమస్యను పూర్తిగా తొలగించగల శక్తిని డిజిటల్ యూనివర్సిటీలో చూస్తున్నాను'' అని ప్రధాని మోడీ అన్నారు.