Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళలో ఆర్ఎస్ఎస్ మూకల ఘాతుకం
తిరువనంతపురం : సీపీఐ(ఎం) కార్యకర్తను ఆర్ఎస్ఎస్ మూకలు అతి దారుణంగా హత్య చేసిన ఘటన కేరళలోని కన్నూర్ జిల్లా న్యూమహే సమీపంలోని పున్నోల్‌లో సోమవారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. మత్స్యకారుడు కొరాంబిల్ హరిదాసన్ (54) పని నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా అతని పెరటి సమీపంలో మాటువేసిన ఆర్ఎస్ఎస్ మూకలు గుంపు ఒక్కసారిగా మారణాయుధాలతో దాడి చేసింది. అరుపులు విన్న హరిదాసన్ సోదరుడు, అతని కుటుంబం వచ్చేసరికి పారిపోయింది. హరిదాసన్ను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. హత్య జరిగిన ఇంటి పెరట్లో దాడికి ఉపయోగించిన గొడ్డలి, ఇనుప రాడ్‌ను పోలీసులు గుర్తించారు. ఫోరెన్సిక్ నిపుణులు తనిఖీలు చేపట్టారు. ఏడుగురు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. హరిదాసన్ శరీరంపై 20కి పైగా గాయాలున్నాయని, లోతైన గాయాలే ఆయన మృతికి కారణమని విచారణ నివేదికలో పేర్కొంది.
శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసేందుకే : విజయన్
కొరాంబిల్ హరిదాసన్ హత్యను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రంగా ఖండించారు. హరిదాసన్ మృతికి తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ, ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ దారుణ హత్యలో పాల్గొన్న నిందితులందరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించామన్నారు. కేరళలో శాంతియుత వాతావరణాన్ని విచ్ఛిన్నం చేయాలనే దుర్మార్గపు అజెండాతో ఈ హత్య జరిగిందని, దీన్ని ఓడించాలని పిలుపునిచ్చారు.