Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉమా భారతి దత్తత తీసుకున్న నది పరిస్థితి
- దుర్వాసనతో మురికి కూపంగా..
- ఆందోళన వ్యక్తం చేస్తున్న స్థానికులు
లక్నో : బీజేపీ అగ్రనేత, కేంద్ర జలవనరుల శాఖ మాజీ మంత్రి ఉమాభారతి దత్తత తీసుకున్న నది పరిస్థితి చాలా అధ్వాన్నంగా తయారైంది. 2014లో కేంద్రంలో నరేంద్ర మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమా భారతి కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా ఉమా భారతి ఉన్నారు. యూపీలోని ఝాన్సీ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహించారు. అయితే, 2014లో ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంసద్ గ్రామ్ యోజనను ఉటంకిస్తూ ప్రధాన మంత్రి సంసద్ గ్రామ్ యోజన కింద గ్రామాలను దత్తత తీసుకునే ప్రణాళికను అమలు చేస్తామన్నారు. దీని ప్రకారం దేశంలోని ప్రతి ఎంపీ కూడా తన ప్రాంతంలోని నదిని దత్తత తీసుకోవాలి. ఇందులో భాగంగా ఉమాభారతి తన పార్లమెంటరీ నియోజకవర్గం ఝాన్సీలోని పహుజ్ నదిని దత్తత తీసుకున్నారు. దానిని సంరక్షిస్తూ పరిశుభ్రంగా ఉంచుతామని ప్రతిజ్ఞ చేశారు. అలాగే, నదీ ప్రక్షాళనకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం పైనా మాట్లాడారు.
ప్రస్తుతం ఈ నది పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. ఒక మురికి కాలువలాగా తయారైంది. పచ్చిగడ్డితో నిండిన చదునైన మైదానంలా కనువిందు చేయడం మనకు కనిపిస్తుంది. నదీ ముఖద్వారం వద్ద ఇండ్లు, కాలనీల నిర్మాణాలున్నాయి. పాలకవర్గం అండదండలతో నది ముంపు ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపించారు. నది చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడ చూసినా చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి. సరైన నిర్వహణ లేకపోవడంతో ఘాట్లు విరిగిపడి ఘాట్‌కు ఆనుకొని ఉన్న భూమిలో లోతైన గుంతలు ఏర్పడి చెత్తతో నిండిపోయింది. ''ఉమాభారతి పహుజ్ను దత్తత తీసుకున్నప్పుడు నది రోజులు మారుతాయని ప్రజలు భావించారు. కానీ అలా జరగలేదు. నది మురికి కూపంగా మారింది. దుర్వాసన వెదజల్లుతోంది. నీరు రంగు మారింది'' అని బుందేల్‌ఖండ్ నిర్మాణ మోర్చా అధ్యక్షుడు భాను సహారు అన్నారు. ప్రభుత్వం అండదండలతోనే నదీప్రాంతంలో ఆక్రమణలు జరగుతున్నాయన్నారు. ప్రభుత్వ ప్రోద్బలంతోనే ఇలా జరిగితే పరిస్థితి ఎలా? అని స్థానికులు, సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు.