Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభివృద్ధి చెందుతున్న దేశాలు డెవలపింగ్ ప్రాజెక్టులపై దృష్టి సారించాలి
- భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్
- ఆయా దేశాలకు చైనా ఇచ్చే రుణాల పైనే పరోక్షంగా వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు అధిక అప్పులతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. మ్యునిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్లో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విదేశీ పెట్టుబడులను కోరే అభివృద్ధి చెందుతున్న దేశాలు డెవలపింగ్ ప్రాజెక్టులపై ఖర్చు చేయాలని ఆయన సూచించారు. కాన్ఫరెన్స్ సందర్భంగా ప్యానెల్లో భాగమైన భారత విదేశాంగ మంత్రి.. బంగ్లాదేశ్ ఆర్థిక మంత్రి ఏ.కే. అబ్దుల్ మోమెన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా పై విధంగా స్పందించారు. ఈ ప్యానెల్లో ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, జపాన్, యూఎస్ సెనెటర్ జీన్నె షహీన్ లు సభ్యులుగా ఉన్నారు.
బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్థాన్లతో పాటు పలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు చైనా భారీ మొత్తంలో రుణాలిస్తూ ఆ దేశాలకు తోడ్పాటునందిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ విషయంలో జైశంకర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. '' భారీ ఎత్తున రుణాలు, చక్కని ప్రతిపాదనలతో చైనా ముందుకొస్తున్నది. ఇది మీకు సమస్యగా ఉన్నది. ఏమి చేయాలి?'' అని బంగ్లాదేశ్ మంత్రి ఈ సమావేశంలో ప్రశ్నించారు. ప్రస్తుతం చైనా ఆఫర్ చేస్తున్న విధంగా క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్ (క్వాడ్ అంటే యూఎస్, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా దేశాల కలయిక) ఆర్థికంగా సహాయాన్ని అందించగలదా? అని అన్నారు.
అంతర్జాతీయ సంబంధాలలో పోటీ తత్వం ఉన్నదని జైశంకర్ ఈ సందర్భంగా తెలిపారు. ప్రతి దేశమూ అవకాశాల కోసం చూస్తుందన్నారు. '' మేము చాలా దేశాలను చూశాం. మా ప్రాంతంలోని దేశాలనూ గమనించాం. తీవ్రమైన అప్పులతో ఆ దేశాలు సతమతమవుతున్నాయి'' అని జైశంకర్ చెప్పారు. అయితే, జైశంకర్ తన వ్యాఖ్యల్లో ఎక్కడా ఏ దేశం పేరునూ వెల్లడించనప్పటికీ ఆయన వ్యాఖ్యలు చైనా.. శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి దేశాలలో మౌలిక సదుపాయాలు, ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ఇచ్చిన రుణాల విషయం గురించే అని అంతర్జాతీయ రాజకీయ నిపుణులు అభిప్రాయపడ్డారు. సరిహద్దు స్థితి.. సంబంధాల స్థితిని నిర్ణయిస్తుందని చైనాతో సంబంధాల గురించి మాట్లాడుతూ జైశంకర్ అన్నారు. ప్రస్తుతం చైనాతో సంబంధం ''క్లిష్టమైన దశ'' ద్వారా వెళ్తున్నదన్నారు.