Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 28 వరకూ నిరసనలకు ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ పిలుపు
న్యూఢిల్లీ : పెద్ద మొత్తంలో డీజిల్ కొనుగోలు చేసేవారికి ఒకేసారి భారీగా ధరలు పెరిగాయి. ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే కొద్ది రోజుల క్రితం వీటిని పెంచారు. ఈ పెంపును అఖిల భారత రోడ్డు రవాణా కార్మికుల సమాఖ్య (ఏఐఆర్టీడబ్ల్యూఎప్) తీవ్రంగా ఖండించింది. తక్షణమే ఈ పెంపును ఉపసంహరించాలని డిమాండ్ చేసింది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలను దృష్టిలో వుంచుకుని రిటైల్ ధరలు పెంచకపోవడంతో చమురు కంపెనీలు భారత ప్రభుత్వ అనుమతిని రహస్యంగా తీసుకుని చాపకింద నీరులా ఈ చర్యలు చేపడుతున్నాయి. పెద్ద మొత్తంలో కొనుగోలు చేసేవారికి చేసిన ఈ పెంపు ప్రపంచవ్యాప్తంగా అమల్లో వును సాధారణ వ్యాపార కార్యకలాపాలకు విరుద్ధంగా వుందని ఎఐఆర్‌టిడబ్ల్యుఎఫ్ విమర్శించింది. రిటైల్ ధరల కన్నా టోకుమార్కెట్లో ధరలు ఎప్పుడూ తక్కువగానే వుండాలి. ప్రస్తుతం పెంచిన పెంపుదల అనైతికమని, దేశంలో ఎస్టీయులపై మోయలేనిభారం పడుతుందని విమర్శించింది. పెద్ద మొత్తంలో డీజిల్ ధరలను అసాధారణ రీతిలో పెంచడమంటే ప్రయాణం చేసే ప్రజలపై భారీగా భారం మోపడమే అవుతుందని పేర్కొంది. ఈ ప్రజా వ్యతిరేక విధానాన్ని తిరస్కరిస్తూ పోరాడాలని సమాఖ్య పిలుపునిచ్చింది. దీనిపై సోమవారం నిరసనలు ప్రారంభమయ్యాయి. వీటిని, ఈ నెల 28వరకు కొనసాగించాలని, దేశవ్యాప్తంగా నిరసన కార్యాచరణ చేపట్టాలని అనుబంధ యూనియన్లకు, సమాఖ్యలకు ఎఐఆర్‌టిడబ్ల్యుఎఫ్ పిలుపునిచ్చింది. ఏ యూనియన్‌కి చెందిన వారమనే దానితో నిమిత్తం లేకుండా అందరూ నిరసనల్లో పాల్గొనాల్సిందిగా ఎస్టీయూల్లోని యూనియన్లకు విజ్ఞప్తి చేసింది.