Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
న్యూఢిల్లీ : ఇరు దేశాల మధ్య నెలకొన్న విభేదాల పరిష్కారానికి భారత ప్రధాని నరేంద్ర మోడీతో చర్చలు జరపాలనుకుంటున్నట్టు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. రెండు రోజుల రష్యా పర్యటనకు ముందు.. ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇమ్రాన్ కీలక వ్యాఖ్యలుచేశారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించగలిగితే భారత ఉపఖండంలోని కోట్లాది జనాభాకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఉగ్రవాదం, కాశ్మీర్ ఇతరత్రా సమస్యల కారణంగా.. రెండు దేశాల మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే కొనసాగుతున్న విషయం తెలిసిందే. పాక్ భూభాగంలో ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తే.. చర్చలు జరుపుతామని భారత్ అనేక సందర్భాల్లో స్పష్టం చేసింది. ఉగ్రవాదం, చర్చలు ఒకదానితో ఒకటి కలిసి సాగలేవనీ తేల్చిచెప్పింది.
అన్ని దేశాలతో వాణిజ్య సంబంధాలు కలిగి ఉండటం తమ ప్రభుత్వ విధానమనీ, అయితే భారత్తో ద్వైపాక్షిక సంబంధాలు మారడంతో.. వాణిజ్యం కూడా తగ్గిపోయిందన్నారు. ఉక్రెయిన్ సంక్షోభంపై స్పందిస్తూ.. 'ఇది మాకు సంబంధించిన వ్యవహారం కాదు. పాక్కు రష్యాతో ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయి. వాటిని బలోపేతం చేయాలనుకుంటున్నాం' అని అన్నారు.