Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తప్పు చేసిన గవర్నర్లను తొలగించేందుకు చట్టబద్ధమైన రీతిలో..
- గవర్నర్ల నియామకం, రీకాల్‌లో రాష్ట్రాలకు భాగస్వామ్యం కల్పించండి: కేంద్రానికి కేరళ ప్రభుత్వం ప్రతిపాదనలు
న్యూఢిల్లీ : రాష్ట్రాల్లో తప్పు చేసిన గవర్నర్లను తొలగించేందుకు చట్టబద్ధమైన అధికారాలను రాష్ట్రాలకు ఇవ్వాలని కేరళ ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది. ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం కల్పించేందుకు రాజ్యాంగాన్ని సవరించాలని కేరళ ప్రభుత్వం సిఫారసులను కేంద్రం ముందు ఉంచింది. కేంద్ర-రాష్ట్ర సంబంధాల్లో అమలు చేయాల్సిన మార్పులపై జస్టిస్ (రిటైర్డ్) మదన్ మోహన్ పుంఛీ కమిషన్ చేసిన సిఫారసులపై అభిప్రాయాలను కోరుతూ కేంద్రం పంపిన సందేశానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నది.
పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ టార్గెట్ చేస్తూ నిరంతరం కేంద్రం కనుసన్నల్లో నిర్ణయాలు తీసుకుంటున్నారు. చాలా సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ చేయాల్సిన ప్రసంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంపితే, దాన్ని ఆసరాగా చేసుకొని గవర్నర్ బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం గవర్నర్ నియామకం, రీకాల్‌పై కేంద్రానికి సిఫారసు చేసింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాలలో గవర్నర్లు, ఆయా రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రభుత్వాలపై నియంత్రణ చేస్తున్న దృష్ట్యా కూడా ఈ పరిణామం ప్రాధాన్యాన్ని కలిగి ఉన్నది.
రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించిన, ఛాన్సలర్‌గా తప్పుగా బాధ్యతలు నిర్వహించిన, క్రిమినల్ ప్రాసిక్యూషన్ బాధ్యలను సక్రమంగా నిర్వర్తించడంలో విఫలమైన గవర్నర్‌ను తొలగించే అవసరమైన అన్ని అధికారాలను రాష్ట్ర అసెంబ్లీకి ఇవ్వాలని కేరళ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు పుంఛీ కమిషన్ సిఫారసుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర న్యాయ శాఖ కార్యదర్శి నివేదిక సమర్పించారు. ఈ నివేదికను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. దీన్ని కేంద్రానికి పంపేందుకు మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది.
కేరళ చేసిన ప్రతిపాదనల్లో ముఖ్యాంశాలు
రాష్ట్ర సమ్మతితో మాత్రమే గవర్నర్లను నియమించాలి
రాజ్యాంగంలోని ఆర్టికల్ 155 ప్రకారం ''రాష్ట్ర గవర్నర్‌ను సంబంధిత రాష్ట్రంతో సంప్రదించి రాష్ట్రపతి నియమించాలి. రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్యానెల్ నుంచి నియామకం అమలు చేయాలి'' అనే విధంగా రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉంది.
గవర్నర్‌ను రీకాల్‌కు సిఫారసు
చేసే అధికారం రాష్ట్రాలకు ఉండాలి
గవర్నర్‌ను రీకాల్ చేసే విషయంలో రాష్ట్ర శాసన సభ సిఫారసు చేసేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 156కి సవరణ చేయాలి. అవినీతి నిరోధక చట్టం కింద యూనివర్సిటీల ఛాన్సలర్, మంత్రుల మండలి ప్రాసిక్యూషన్ శాంక్షన్ అథారిటీ వంటి రాజ్యాంగపరమైన, చట్టబద్ధమైన విధులను నిర్వర్తిస్తున్నప్పుడు అతను రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించినట్లు తేలితే, అలాంటి సందర్భాల్లో గవర్నర్‌ను రీకాల్‌కు సిఫారసు చేసే అధికారం రాష్ట్రాలకు ఉండాలి. కొత్త గవర్నర్ నియామకంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా సంప్రదించాలి.
బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపేందుకు
కాల పరిమితిని నిర్ణయించాలి
శాసనసభ ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపేందుకు ఆర్టికల్ 200లో నిర్దిష్ట కాల పరిమితి లేదని కేరళ ప్రభుత్వం ఎత్తి చూపింది. ''నిర్దిష్ట కాల పరిమితి లేకపోవడం వల్ల బిల్లును తిరిగి పొందడంలో కొంత జాప్యం జరగవచ్చు. ఇది పూర్తిగా ''అధికార విభజన''కు సంబంధించిన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. కొన్నిసార్లు శాసన వివేకాన్ని అడ్డుకోవచ్చ'' అని కేరళ ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది.
1. పుంఛీ కమిషన్: 35 ఏండ్లు నిండిన ఎవరినైనా గవర్నర్‌గా నియమించొచ్చు.
కేరళ ప్రభుత్వ్ణం ఉన్నత స్థాయి గౌరవం ఉన్న వ్యక్తిని గవర్నర్గాఈ నియమించాలి.
2. పుంఛీ కమిషన్ : గవర్నర్‌ను తొలగించేందుకు రాష్ట్రపతికి విచక్షణాధికారం కల్పించేందుకు ఒక చట్టం తీసుకురావాలి. అయితే తన కేసును వాదించేందుకు గవర్నర్‌కు అవకాశం కల్పించాలి.
రాష్ట్ర ప్రభుత్వ్ణం గవర్నర్‌ను రీకాల్ చేసే నిబంధనను ప్రవేశపెట్టాలి. గవర్నర్ నియామకంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలి. ఇందుకోసం రాజ్యాంగాన్ని సవరించాలి.
3. పుంఛీ కమిషన్: పదవిలో ఉన్న వ్యక్తి రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తే గవర్నర్‌ను అభిశంసించే నిబంధన ఉండాలి.
రాష్ట్ర ప్రభుత్వ్ణం గవర్నర్ రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించినట్లు, లేదా ఛాన్సలర్‌గా పని చేస్తున్నప్పుడు తీవ్రమైన లోపాలకు పాల్పడినట్టు లేదా క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు సంబంధించిన వ్యవహారాల్లో విఫలమైనట్లు తేలితే గవర్నర్‌ను తొలగించే అధికారాలను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలి.
4. పుంఛీ కమిషన్: రాజ్యాంగ విధుల నిర్వహణలో కాకుండా ఇతర అంశాలలో మంత్రివర్గం సలహా మేరకు గవర్నర్ వ్యవహరించాలి. గవర్నర్‌కు అనేక రంగాలపై వివక్షత అధికారాలు లేవు. కొన్ని విషయాలలో రాష్ట్ర ప్రభుత్వంతో విభేదించకుండా గవర్నర్ విచక్షణాధికారాన్ని ఉపయోగించాలి.
రాష్ట్ర ప్రభుత్వం: గవర్నర్ విచక్షణ అధికారాలను అరికట్టాలి. గవర్నర్ సంతకం చేసిన తరువాత వీలైనంత త్వరగా బిల్లులను రాష్ట్ర ప్రభుత్వానికి పంపేలా కొత్త యంత్రాంగాన్ని రూపొందించాలి. ఇప్పుడు గవర్నర్ సంతకం చేసిన ఫైలును వెనక్కి తీసుకోవడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది.
5.పుంఛీ కమిషన్: క్రిమినల్ ప్రాసిక్యూషన్ అభ్యర్ధనలను మంజూరు చేసేటప్పుడు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయాన్ని అనుసరించే బదులు గవర్నర్ సుప్రీం కోర్టు మార్గదర్శకాలను అనుసరించాలి.
రాష్ట్ర ప్రభుత్వం: ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తుంది. ఈ విషయంపై రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయాన్ని గవర్నర్ ఆమోదించాలి. ఎందుకంటే ఇది ఎన్నికైన ప్రభుత్వ నిర్ణయం.
6. పుంఛీ కమిషన్: విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ పదవిని గవర్నర్‌ను కేటాయించాల్సిన అవసరం లేదు.
రాష్ట్ర ప్రభుత్వం: పైన పేర్కొన్న ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. ఎందుకంటే ఇది విశ్వవిద్యాలయాలు పరిష్కరించాల్సిన అంశం. గవర్నర్‌కు చాలా రాజ్యాంగ బాధ్యలు ఉన్నాయి కాబట్టీ గవర్నర్‌ను యూనివర్సిటీల ఛాన్సలర్‌గా నియమించాల్సిన అవసరం లేదు.
7. పుంఛీ కమిషన్: కేంద్ర బలగాలను రాష్ట్రానికి పంపే ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలి.
రాష్ట్ర ప్రభుత్వ్ణం అత్యవసర శాంతి భద్రతల పరిస్థితులను ఎదుర్కోవడానికి సంబంధిత రాష్ట్రానికి కేంద్ర దళాలను పంపే ముందు సంప్రదింపులు మాత్రమే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కూడా పొందాలి.
8. పుంఛీ కమిషన్: రాజ్యసభ సీట్లను రాష్ట్రాల మధ్య సమానంగా విభజించాలి. ఇది రాష్ట్ర జనాభాపై ఆధారపడి ఉండకూడదు.
రాష్ట్ర ప్రభుత్వం: పై ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. ఇతర దేశాల పరిస్థితిని సమీక్షించిన తర్వాతే ఈ అంశంపై నిర్ణయం తీసుకోవచ్చు.
9. పుంఛీ కమిషన్: రాజ్యాంగంలోని ఆర్టికల్ 253 ప్రకారం కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ఒప్పందంపై సంతకం చేయడానికి ముందు ఒక చట్టాన్ని ఆమోదించాలి. దీనిపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు.
రాష్ట్ర ప్రభుత్వం: రాష్ట్రాల అభిప్రాయాన్ని భారత రాష్ట్రపతి ద్వారా తెలుసుకోవాలి. ఆ తర్వాత రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించాలి.