Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెంటనే విడుదల చేయాలి : సీపీఐ(ఎం)
బెంగళూరు : హైకోర్టు న్యాయమూర్తిపై అభ్యంతరకర ట్వీట్ చేశారని ఆరోపిస్తూ కన్నడ సినీనటుడు చేతన్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు. ఆయనపై ఐపీసీ సెక్షన్ 505 (2), 504 కింద శేషాద్రిపురం పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైందని సెంట్రల్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎంఎన్ అనుచేత్ తెలిపారు. హిజాబ్ కేసును విచారిస్తున్న జడ్జిపై చేతన్ అభ్యంతరకరంగా ట్వీట్ చేశారని ఆయన పేర్కొన్నారు. చేతన్‌కు, తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే అరెస్టు చేశారని ఆయన భార్య మేఘా తెలిపారు. చేతన్ కుమార్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శేషాద్రిపురం పోలీస్ స్టేషన్, బెంగళూరు పోలీస్ కమిషనర్ కార్యాలయాల వద్ద మగళవారం రాత్రి పలు సంఘాల ఆధ్వర్యాన ఆందోళనలు నిర్వహించారు.
చేతన్ అరెస్టుకు సీపీఐ(ఎం) ఖండన
చేతన్ ట్వీట్‌పై సుమోటాగా పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్టు చేయడాన్ని సీపీఐ(ఎం) కర్నాటక రాష్ట్ర కార్యదర్శి బసవరాజ ఖండించారు. చేతన్‌ను వెంటనే విడుదల చేయాలని ఆయన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. న్యాయమూర్తి పేరు ప్రస్తావించకూడదన్న నిబంధనలు ఉల్లంఘించినందుకు దర్యాప్తు చేసి ఉండవచ్చునని, సుమోటాగా ఫిర్యాదు తీసుకుని, అరెస్టు చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. భిన్నాభిప్రాయాలను అణిచివేసేందుకు రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగమే ఈ పరిణామమని పేర్కొన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు చేసే రెచ్చగొట్టే ప్రకటనలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేలా, సామాజిక విధ్వంసానికి కారణమయ్యే ఘటనలు జరుగుతున్నప్పుడు పోలీసు శాఖ ఇలాగే సుమోటాగా కేసులు పెట్టిందా? అని ప్రశ్నించారు. చేతన్ సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి అని, ఆయనను విడుదల చేయాలని కోరారు.
చేతన్ అరెస్టు ఎందుకు?
జన్మతహ అమెరికా పౌరుడైన చేతన్, యేల్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఈ నెల 19న బెంగళూరులో వివిధ దళిత సంస్థలు సుమారు లక్షా 50 వేల మందితో నిర్వహించిన భారీ ర్యాలీలో చేతన్ పాల్గొన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా రాయచూర్‌లోని జిల్లా కోర్టు నుంచి అంబేద్కర్ ఫొటోను తొలగించడాన్ని నిరసిస్తూ ఈ ఆందోళన జరిగింది. మతతత్వ అజెండాను నిరసిస్తూ అదే రోజున చేతన్ ట్వీట్ చేశారు. అంబేద్కర్, ద్రావిడ ఉద్యమ నిర్మాత పెరియార్ల భావజాలాన్ని సమర్థిస్తూ, పౌరసత్వ (సవరణ) చట్టం సహా పలు అంశాలపై ఆయన గళం విప్పుతుంటారు. ప్రగతిశీల ఉద్యమాలను సమర్థిస్తూ, మతతత్వాన్ని నిరసిస్తూ పలు ఆందోళనల్లోనూ పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే అరెస్టు జరిగిందని పలువురు విమర్శిస్తున్నారు.