Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెట్రోల్ పోసి నిప్పంటించిన వైనం
- బీహార్‌లో గో గూండాల దురాగత వీడియో వైరల్
పాట్నా, న్యూఢిల్లీ : బీహార్‌లో గో గూండాలు రెచ్చిపోయారు. గొడ్డు మాంసం విక్రయించే వ్యక్తుల పేర్లు చెప్పాలంటూ ఓ ముస్లిం యువకుడిపై దాడి చేసి, హత్య చేశారు. అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించి.. గోతిలో పూడ్చిపెట్టారు. శవం త్వరగా కుళ్లిపోయేందుకు ఉప్పు వంటి పదార్థాలు వినియోగించారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. మృతుడిని సమస్తిపూర్ జిల్లాకు చెందిన జనతాదళ్ యునైటెడ్ పార్టీ సభ్యుడు మహ్మద్ ఖలీల్ ఆలంగా గుర్తించారు. మహ్మద్ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా.. విచారణ చేపట్టిన పోలీసులకు... శుక్రవారం బుర్ఖీ గంధక్ నదీతీరాన సగం కాలిన అతని మృతదేహం కనిపించింది. మహ్మద్‌ను కిడ్నాప్ చేశామనీ, డబ్బులివ్వకపోతే కిడ్నీలు అమ్మేస్తామంటూ బాధితుడి ఫోన్ నుంచి కుటుంబ సభ్యులను బెదిరించినట్టు పోలీసులు చెబుతున్నారు. వీడియోలో మహ్మద్‌ను పట్టుకుని గోవులను వధించే ప్రదేశాలు, గొడ్డు మాంసం అమ్మే వ్యక్తుల పేర్లను వెల్లడించాలని బలవంతపెట్టారు. తనకేమీ తెలియదని, తనను ఏమీ చేయవద్దని ఆగంతకులను వేడుకుంటున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. అతడిని విపరీతంగా తిడుతూ, కొడుతూ ఉన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ వీడియోలో నిందితులు తమ ముఖాలు కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. ఈ వీడియో క్లిప్‌ను ట్వీట్ చేసిన ఆర్జెడి నేత తేజస్వియాదవ్.. ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై విరుచుకుపడ్డారు. 'బీహార్ ఎన్డీఏ ప్రభుత్వంలో శాంతి, భద్రతలు పూర్తిగా కొరవడ్డాయి. జెడియు నాయకుడ్ని కొట్టి.. సజీవ దహనం చేసి, పూడ్చి పెట్టారంటే.. పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థమౌతుంది. బీహార్‌లో ఇటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో నితీష్ సమాధానం చెప్పాలి. ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి ఎందుకు తీసుకుంటున్నారో..?' అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.