Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐఏడబ్ల్యూయూ జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్
న్యూఢిల్లీ : దేశ ప్రయోజనాలకు, యూపీ ప్రజలకు ప్రమాదకరంగా ఉన్న యోగీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఈ ఎన్నికల్లో గద్దెదించాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్ పిలుపు నిచ్చారు. సీపీఐ(ఎం) తరపున ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సతీష్, మరో ఇద్దరు నేతలు శాసన సభ స్థానాలకు పోటీ చేస్తున్నారు. వారి విజయాన్ని కాంక్షిస్తూ గత మూడు రోజులుగా వెంకట్ ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ వివిధ బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూపీలోని యోగి ప్రభుత్వం, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అండతో అన్ని విలువలకు తిలోదకాలిచ్చిందనీ, దళితులు, మహిళలు, సామాజిక తరగతులు మీద నిత్యం దాడులుచేస్తూ అరాచకపాలన సాగిస్తుందని విమర్శించారు. గో మాంసం నిషేధంతో లక్షలాది మంది రైతుల జీవితాలు అస్తవ్యస్తంగా మారాయని అన్నారు. యూపీలో పశుపోషణ మీద జీవించటం అనేది ఒక ప్రధాన వ్యాపకంగా ఉందనీ, గోవధ నిషేధంతో దానిపై ఆధారపడి జీవిస్తున్న అన్ని తరగతుల ప్రజలు కష్టాల పాలవుతున్నారని అన్నారు. గత ఎన్నికల్లో మైనారిటీ తరగతులకు ఇతరులకు మధ్య మతోన్మాదచర్యలు రెచ్చగొట్టి, భావోద్వేగాన్ని సృష్టించి బీజేపీ యూపీలో అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. ఇప్పుడు తిరిగి అదే ధోరణితో 20శాతం, 80 శాతం అనే చర్చ చేస్తూ తిరిగి అధికారంలోకి రావటానికి కుతంత్రాలు పన్నుతుందని విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో ఆహార భద్రతకు 65 వేల కోట్లు, ఉపాధి హామీకి 25 వేల కోట్లు కోత విధించి, గ్రామీణ అభివృద్ధి గురించి మోడీ మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని ఆరోపించారు. సీపీఐ(ఎం) తరపున పోటీ చేస్తున్న వ్యవసాయ కార్మిక సంఘం అభ్యర్థులను గెలిపించాలనీ, కష్ట జీవుల వాణిని శాసనసభలో వినిపించాలని ఆయన కోరారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం, సామాజిక న్యాయం కోసం, దేశ ప్రజల రక్షణ కోసం యూపీలో బీజేపీని ఓడించాలని ప్రజలకు ఆయన పిలుపు ఇచ్చారు.