Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలతో ఉక్రెయిన్‌లో ఉంటున్న అనేక మంది భారతీయ విద్యార్థులు భయంతో విలవిలాడుతున్నారు. వీరిలో జమ్ముకాశ్మీర్, కర్నాటకతో పాటు అనేక రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. భారతీయ విద్యార్థుల తరలింపు ప్రక్రియ నెమ్మదిగా సాగుతుండటంతో విద్యార్థులు భయాందోళనల మధ్య రోజులు కొనసాగిస్తున్నారు. 'భారతీయ రాయబార కార్యాలయం ఇచ్చిన తరలింపు ఫారంలను పూరించినప్పటికీ, మాకు ఇంకా ప్రకటన రాలేదు. దీంతో మేం బాంబుల మోత మధ్య గడుపుతున్నాం' అని జమ్ముకాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాకు చెందిన షైక్ అబ్రార్ తెలిపారు. ఉక్రెయిన్‌లోని సుమీ స్టేట్ యూనివర్శిటీలో అబ్రార్ ఎంబిబిఎస్ చదువుతున్నారు. అబ్రార్‌తో సహా ఈ యూనివర్శిటీలో పదుల సంఖ్యలో ఉన్న మిగిలిన జమ్ముకాశ్మీర్ విద్యార్థులు కూడా తరలింపు కార్యక్రమం కోసం ఎదురుచూస్తున్నారు. శ్రీనగర్‌లోని సౌరా ప్రాంతానికి చెందిన మరో ఎంబిబిఎస్ విద్యార్థి మాట్లాడుతూ 'దాడికి సంబంధించిన వార్తలు బయటకు రావడంతో ఇతర విద్యార్థుల ఏడుపు, అరుపులతో రాత్రంతా మేలుకునే ఉన్నాను' అని చెప్పారు. 'కొన్ని ఫారమ్‌లు పూరించమని, మా పాస్ పోర్టులు అందుబాటులో ఉంచమని మమల్ని కోరారు. అవన్నీ మేం పూర్తి చేసినా మాకు ఇంకా ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు' అని తెలిపారు. దాడి వార్తలకు తోడు విద్యార్థులను బేస్మెంట్లకు మార్చాలని యూనివర్శిటీ ఆదేశాలు విద్యార్థులను మరింత భయాందోళనకు గురిచేశాయి. 'విద్యుత్, నీటి సరఫరా నిలిపివేస్తారు కాబట్టి ఫోన్లు ఛార్జ్ చేసుకోమని, తగినంత నీటిని నిల్వ చేసుకోమని మమల్ని కోరారు.
రైళ్లు, బస్సులు నిలిపివేశారు. అత్యవసర వాహనాలు మాత్రమే తిరుగుతున్నాయి' అని విద్యార్థులు చెప్పారు. ఉక్రెయిన్‌లోని వివిధ యూనివర్శిటీల్లో సుమారు 200 మంది కాశ్మీరీ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వీరిలో కొంత మంది ముందుగానే తిరిగి స్వదేశానికి చేరుకన్నా, వీరిలో అనేక మంది తరలింపు ప్రక్రియ కోసం రాయబార కార్యాలయాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. 'కేవలం మా యూనివర్శిటీలోనే సుమారు 3 వేల మంది భారతీయ విద్యార్థులు ఉంటారు. మా దుస్థితిని ఊహించుకోండి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఏమి చేయాలో మాకు తెలియడం లేదు' అని సుమీ స్టేట్ యూనివర్శిటీలో విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వదేశంలో ఉన్న తల్లిదండ్రులతో సంబంధాలు దెబ్బతింటాయనే ఆందోళనతో ఉన్నారు.
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న 346 మంది కర్నాటక వాసులు
ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన రాష్ట్రానికి చెందిన వ్యక్తుల సమాచారాన్ని సేకరించేందుకు కర్ణాటక రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ వెబ్ పోర్టల్‌ను ప్రారంభించింది. మొబైల్ ఫోన్ల్లో కూడా యాక్సెస్ చేసే ఈ పోర్టల్ సమాచారం ప్రకారం శుక్రవారం సాయంత్రానికి ఉక్రెయిన్‌లో 346 మంది కర్ణాటక వాసులు చిక్కుకున్నారు. వీరిలో 115 మంది బెంగళూరుకు చెందిన వారు. అలాగే చిక్కుకున్న మొత్తం మందిలో 91 మంది వైద్య విద్యార్థులు. వీరిలో 28 మంది బెంగళూరుకు చెందిన వారు. మైసూర్‌కు చెందిన వారు 10 మంది, బళ్లారి, హస్సన్ల నుంచి చెరో ఐదుగురు, ఉన్నారు. బగల్కోట్, చమరాజనగర్ల నుంచి చెరో నలుగురు ఉన్నారు. వీరంతా కూడా తరలింపు కార్యక్రమం కోసం ఎదురుచూస్తున్నారు.