Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లైన్ క్లియర్ చేసిన మోడీ సర్కారు
- ఇప్పటికీ పరిష్కారం కాని అటవీ హక్కులు
- సుప్రీంకోర్టు అనుమతులు అమలు కాని వైనం
- కార్పొరేట్లు, బడా వ్యాపారవేత్తల ప్రయోజనాల కోసమేనని పర్యావరణవేత్తల ఆందోళన
న్యూఢిల్లీ : మోడీ సర్కారు అటవీ చట్టాలకు తూట్లు పొడు స్తున్నది. వీటిని తనకు అనుకూలంగా మార్చుకుంటున్నది. పర్యా వరణ చట్టాలను ఇష్టారీతిన మార్చుతున్నది. కార్పొరేట్లు, బడా వ్యాపా రవేత్తల ప్రయోజనాలే ముఖ్యంగా పని చేస్తున్నది. దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలున్నప్పటికీ అటవీ వర్గాల హక్కులను ఇప్పటికీ కేంద్రం పరిష్కరించలేదు. ఇప్పుడు రిజర్వ్డ్ ఫారెస్ట్‌లలో రెసిడెన్షి యల్ యూనిట్లకు (నివాస ప్రాజెక్టులు) మోడీ ప్రభుత్వం లైన్ క్లియర్ చేసింది. ఇందుకు ఇప్పటికే పర్యావరణ చట్టాలను సవరించింది. దేశ వ్యాప్తంగా భారీ అటవీ భూములు ఇప్పటికే ఆక్రమణలో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వమే చేసిన ఆరోపణ. ఇలాంటి తరుణంలోనే కేంద్రం ఇలాంటి చర్యతో ముందుకు రావడం గమనార్హం.
మార్గదర్శకాలు జారీ
ఈ మేరకు కేంద్రం ఈ విషయంలో ఇప్పటికే కొన్ని ఉత్తర్వులను విడుదల చేసింది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (ఎంఓఈఎఫ్సీసీ) ఈ మార్గదర్శకాలను గత నెల 24న జారీ చేసింది. దీని ద్వారా '' అసాధారణ పరిస్థితులలో'' అటవీ భూమిని 1 హెక్టారు విస్తీర్ణంలో నివాస ప్రాజెక్టుల కోసం మళ్లించడానికి పరిగణించవచ్చు. అటవీ హక్కుల చట్టం, 2006 ద్వారా సంబంధిత మంత్రిత్వ శాఖ కార్యాలయ ఉత్తర్వు ద్వారా దీన్ని జారీ చేసింది. అయితే, పార్లమెంటును దాటవేస్తూ ఎవరినీ సంప్రదించకుండా కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత మార్గదర్శకాలను జారీ చేసిందని విశ్లేషకులు తెలిపారు.
'అసాధారణమైన పరిస్థితులంటే?'
అయితే, కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలలో ''అసాధారణమైన పరిస్థితులు'' అనే పదం ఉన్నది. ఈ పదాన్ని సంబంధిత పర్యావరణ మంత్వ్రి శాఖ మాత్రం ఎక్కడా నిర్వచించలేదు. దీనిపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అనిర్వచిత పదాన్ని కేంద్రం తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటుందని ఆరోపణ చేశారు. కార్పొరేట్లు, బడావ్యాపరవేత్తలు, పరిశ్రమలకు అటవీ భూమిని కట్టబెట్టేందుకు కేంద్రం ఇలాంటి చర్యలతో ముందుకొచ్చిందన్నారు. ఇవి అటవీ వర్గాల హక్కులను హరిస్తాయని తెలిపారు.
'పెద్దల అక్రమ నిర్మాణాలు కాపాడటానికే..!'
అటవీ భూములను ఆక్రమిస్తూ ఇప్పటికే పలు నిర్మాణాలున్నాయని చెప్పారు. వీటిలో 'పెద్దల'కు చెందిన విలాసవంతమైన ఫామ్‌హౌజ్‌లు, నిర్మాణాలే అధికంగా ఉన్నాయన్నారు. ఇలాంటి అక్రమ నిర్మాణాలను చట్టం సవరణతో సక్రమం చేయడానికే కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకున్నదని పర్యావరణవేత్తలు, సామాజిక విశ్లేషకులు వివరించారు. '' దేశంలోని అడవుల విషయంలో కేంద్రం నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ఈ విధానం సహజమైన అడవులలో రియల్ ఎస్టేట్ కోసం దారులు తెరుస్తుంది. ఈ విధానం ఎవరికి ప్రయోజనం చేకూర్చడానికి?'' అని ముంబయికి చెందిన కన్జర్వేషన్ యాక్షన్ ట్రస్ట్‌కు చెందిన డెబి గొయెంకా ప్రశ్నించారు. ప్రత్యామ్నాయ స్థలం సాధ్యం కాని గనులు, డ్యామ్‌లు వంటి ప్రాజెక్టుల కోసమే అటవీ భూమిని మళ్లించడానికి అనుమతించాలన్నారు. అలా కాదని నివాస ప్రాజెక్టులకు కేటాయిస్తే 'అక్రమ' నిర్మాణాలకు అధికారికంగా లైసెన్స్ ఇవ్వడమేనని పర్యావరణవేత్తలు ఆరోపించారు. ''భారీ అటవీ భూములను భూ మాఫియా నిరంతరం ఆక్రమణకు గురి చేస్తున్నది. ఇది జీవావరణ క్షీణతకు, వన్యప్రాణుల ఆవాసాలను విచ్ఛిన్నం చేయడానికి దారి తీసింది. ప్రస్తుతం కేంద్రం చర్య అలాంటి మాఫియాకు ఆయుధాన్నిచ్చినట్టవుతుంది'' అని భువనేశ్వర్‌కు చెందిన పర్యావరణవేత్త ఆరోపించారు. ఈ విషయంలో కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని సామాజిక కార్యకర్తలు సూచించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు కార్యరూపం దాల్చి అటవీ వర్గాల హక్కుల విషయంలో పరిష్కారానికి ప్రయత్నం చేయాలని తెలిపారు.