Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
నెల్లూరు :కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలు, కార్మికుల హక్కుల్ని హరిస్తోందని సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం యల్లాయపాళెంలో సిపిఎం నేతలు జడ్డా మస్తానయ్య, కాకి పిచ్చయ్య, షేక్ ఇమాంషా సంతాప సభ ఆదివారం జరిగింది. సీనియర్ నాయకులు భైన శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన సభలో శ్రీనివాసరావు మాట్లాడుతూ వ్యవసాయ కార్మిక సంఘం ఏపీ రాష్ట్ర కమిటీ సభ్యునిగా మస్తానయ్య పనిచేశారన్నారు. ఆయన సేవలను కొనియాడారు. ఇమాంషా యల్లాయపాళెంలో జరిగిన భూపోరాటాల్లో చురుగ్గా పాల్గొన్నారని తెలిపారు. మస్తానయ్య, పిచ్చయ్య, ఇమాంషా యల్లాయపాళెంలో జరిగిన అనేక పోరాటాలకు నాయకత్వం వహించారన్నారు. సమస్యలను పరిష్కరించాలని, ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరిన వారిపై ఇటీవల కాలంలో నిర్బంధాలు ఎక్కువయ్యాయన్నారు. బిజెపి ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని బీజేపీకి అధికారంలో ఉండే అర్హతలేదన్నారు. రాజకీయ లబ్ది కోసం మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారని తెలిపారు. జీఎస్టీ పేరుతో నిరుపేద, మధ్యతరగతి ప్రజల నుంచి భారీగా వసూళ్లు చేస్తున్నారని, రాష్ట్రానికి ఇవ్వాల్సిన జిఎస్టి రూ.67,800 కోట్లు ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. కమ్యూనిస్టులు పోరాడి సాధించిన ఉపాధి హామీ చట్టాన్ని ఎక్కడా సరిగా అమలు చేయడంలేదన్నారు. రైతు, ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తోన్న బీజేపీని గద్దె దింపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం)నెల్లూరు జిల్లా కార్యదర్శి మూలం రమేష్, కార్యదర్శివర్గ సభ్యులు ఎన్.యాదగిరి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జొన్నలగడ్డ వెంకమరాజు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి పులిగండ్ల శ్రీరాములు పాల్గొన్నారు.