Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలుచోట్ల లెఫ్ట్ ఫ్రంట్ ఆందోళనలు
కోల్‌కతా : బెంగాల్ మున్సిపల్ ఎన్నికలు హింసాత్మకంగా జరిగాయి. 20 జిల్లాల్లోని 106 మునిసిపాలిటీలలో పోలింగ్ జరిగింది. అభ్యర్థులను బెదిరించడం, దాడులు చేయడం, ప్రచారం చేయకుండా నిరోదించడం తదితర కారణాల వల్ల పలుచోట్ల నామినేషన్లు సైతం వేయలేని పరిస్థితి నెలకొంది. అడ్డంకులను అధిగమించి, పలుచోట్ల అభ్యర్థులు నామినేషన్లు వేసినప్పటికీ బూత్‌లను స్వాధీనం చేసుకుని పలుచోట్ల తృణమూల్ గూండాలు అరాచకానికి పాల్పడ్డారు. ఆదివారం ముర్షిదాబాద్‌లోని ధులియన్, జంగీపూర్‌లో బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. పలుచోట్ల ఇవిఎంలు ధ్వంసమయ్యాయి. ధులియన్ మున్సిపాలిటీలోని 13వ వార్డులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బూత్‌ను కబ్జా చేశారు. దల్ఖోలా మున్సిపాలిటీలోని ఐదో వార్డు దేశ్‌బంధు పారాలోని బూత్‌లో నకిలీ ఓటర్లను అదుపులోకి తీసుకున్నారు. భట్పరాలోని గాంధీ విద్యాపీఠ్‌లో ఇవిఎం ధ్వంసమవడంతో ఓటింగ్ నిలిచిపోయింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఇవిఎంను ధ్వంసం చేశారని పోలింగ్ అధికారి తెలిపారు. భట్పరా వద్ద ఓటింగ్ నిలిచిపోయింది. సోనాముఖి మున్సిపాల్టీలో ఓటరుపై టిఎంసికి చెందిన వారు దాడికి పాల్పడ్డారు. దీంతో, యువకుడు బిశ్వజిత్ గుయి తీవ్రంగా గాయపడ్డాడు.
తృణమూల్ అక్రమాలపై పలుచోట్ల లెఫ్ట్ ఆందోళనలు
జంగిపూర్ మున్సిపాల్టీలో సీపీఐ(ఎం) అభ్యర్థి జియావుల్ షేక్‌పై తృణమూల్ గూండాలు దాడి చేశారు. దీంతో, ఆయన ఆసుపత్రిలో చేరారు. బుర్ద్వాన్ మున్సిపాల్టీలోని కర్జోంగేట్ వద్ద సీపీఐ(ఎం) ఆధ్వర్యాన తృణమూల్ గూండాల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దిన్హటా మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారంటూ లెఫ్ట్ ఫ్రంట్ ఆధ్వర్యాన భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. కాల్నలోని నిభుజిమోర్ ప్రాంతంలో రోడ్డుపై సిపిఎం కార్యకర్తలు ఆందోళన చేశారు. సౌత్ దండం మున్సిపాల్టీలోని 33వ వార్డు 108వ నెంబరు పోలింగ్‌బూత్‌లో తృణమూల్ గూండా ఓటర్ల తరపున తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తున్న వీడియో వైరల్ అయ్యింది.