Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 38 స్థానాల్లో పోలింగ్
- బిజెపికి ఇక్కట్లే..
ఇంఫాల్ : మణిపూర్ అసెంబ్లీ తొలి దశ ఎన్నికలు సోమవారం జరగనున్నాయి. మూడు ఇంఫాల్ వ్వాలీ, మూడు కొండ ప్రాంత జిల్లాల్లోని 38 నియోజకవర్గాలకు తొలి దశలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సోమవారం ఓటింగ్ జరిగే ఈ 38 నియోజకవర్గాల్లో అధికార బిజెపికి కష్టాలు తప్పేటట్లు లేవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానాల్లో విజయంతో బిజెపి అధికారంలోకి వచ్చినా.. ఈసారి మాత్రం ఓటమి తప్పదని భావిస్తున్నారు. ఎందుకంటే బిజెపికి చిరకాల ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచితో పాటు కొత్త ప్రత్యర్థి నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పిపి) నుంచి కూడా గట్టి పోటీ ఎదరువుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో బిజెపి-ఎన్‌పిపి కూటమిగా కలిసిపోటీ చేశాయి. ఈసారి మాత్రం ఎన్‌పిపి బిజెపితో బంధం తెంచుకుని బరిలోకి దిగింది. అలాగే బీహార్, కేంద్రంలో మిత్రపక్షమైన జనతా దళ్ యునైటెడ్ (జెడి-యు) మణిపాల్‌లో బిజెపికి పోటీకి రావడం విశేషం. సోమవారం ఇంఫాల్ వ్యాలీలోని ఇఫాంల్ తూర్పు, ఇఫాంల్ పశ్చిమ, బిష్ణుపూర్ జిల్లాల్లోని 29 నియోజకవర్గాలకు, కొండ ప్రాంత జిల్లాలు కాంగ్పోక్పి, చౌరచంద్పూర్, ఫెర్జావాల్లోని 9 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో మొత్తం 38 స్థానాల్లోనూ బిజెపి పోటీ చేస్తోంది. కాంగ్రెస్ 35, జెడి(యు) 28, ఎన్‌పిపి 27 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఇంక శివసేన ఏడు, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా (అధేవాలే), నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీలు చెరో ఆరు, లోక్ జనశక్తి పార్టీ 3 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఇవన్నీ కూడా బిజెపికి గట్టి పోటీ ఇస్తాయని అంచనా.
ముఖ్యంగా ఎన్‌పిపి నుంచి బిజెపికి తీవ్ర పోటీ వస్తుందని భావిస్తున్నారు. నిజానికి సోమవారం జరుగుతున్న అన్ని స్థానాలకు ఎన్‌పిపి అభ్యర్థులు నామినేషన్ వేశారు. బిజెపి అధికార బలంతోపాటు, ఎన్‌పిపి అభ్యర్థులపై దాడులు చేసి 11 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థుల నామినేషన్ చెల్లకుండా, ఉపసంహరించుకునే విధంగా చేసింది. దీనిపై ఇప్పటికే ఎన్‌సిపి అధ్యక్షులు, మేఘాలయ ముఖ్యమంత్రి కె సంగ్మా విమర్శలు చేశారు. మణిపూర్ ఎన్నికల్లో జరుగుతున్న హింసను తాను గతంలో ఎ ఎన్నికల్లోనూ చూడలేదని చెప్పారు. అందుకు తగ్గట్లుగానే గత 20 రోజుల నుంచి మణిపూర్‌లో అనేక హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ఎన్‌పిపి అభ్యర్థి తండ్రిని కాల్చిచంపారు. ఇవన్నీ కూడా నేటి పోలింగ్‌లో ప్రభావం చూపిస్తాయని విశ్లేషకులు నమ్ముతున్నారు. అసలు ఈ ఎన్నికల్లో టిక్కెట్ల పంపిణీ నుంచి బిజెపికి కష్టాలు ప్రారంభమయ్యాయి. టిక్కెట్లు రాని బిజెపి అసంతృప్తి నేతలంతా కాంగ్రెస్, ఎన్పిపిలోకి చేరిపోయారు. వారంతా ఇప్పడు బిజెపికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఇలాంటి నేపధ్యంలో జరుగుతున్న నేటి తొలి దశలో బిజెపికి కష్టాలు తప్పేటట్లు లేవు. కాగా, మొత్తంగా 60 స్థానాలు ఉన్న మణిపూర్ అసెంబ్లీకి రెండు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.