Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హెచ్పీసీ చైర్మెన్ పదవికి ప్రముఖ పర్యావరణవేత్త రవిచోప్రా రాజీనామా
- సుప్రీంకోర్టు సెక్రెటరీ జనరల్‌కు లేఖ
- పర్యావరణానికి నష్టం కలిగించే చర్యలపై ఆందోళన
న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్‌లో నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన చార్ ధామ్ హైవే విస్తరణ ప్రాజెక్టుకు ఎదరుదెబ్బ తగిలింది. ఈ ప్రాజెక్టు పర్యావరణ ప్రభావాన్ని పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు నియమించిన హై పవర్డ్ కమిటీ (హెచ్పీసీ) చైర్మెన్ పదవికి డెహ్రాడూన్‌కు చెందిన ప్రముఖ పర్యావరణవేత్త రవి చోప్రా ఇటీవల రాజీనామా చేశారు. ఈ ప్రాజెక్టుతో పర్యావరణానికి నష్టం కలిగే చర్యలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. రూ.12 వేల కోట్లతో 889 కిలో మీటర్ల దూరం కలిగిన చార్ ధామ్ హైవే విస్తరణ ప్రాజెక్టును మోడీ ప్రభుత్వం చేపడుతున్నది. హిమాలయ ప్రాంతంలోని అతిపెద్ద రోడ్డు విస్తరణ ప్రాజెక్టులలో చార్ ధామ్ ప్రాజెక్టు ఒకటి. గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ వంటి నాలుగు పవిత్ర క్షేత్రాలను కలపడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం నియమించిన హెచ్పీసీ చైర్మెన్ రాజీనామా చేయడం చర్చనీయాం శంగా మారింది. రవిచోప్రా తన రాజీనామా పత్రాన్ని సుప్రీంకోర్టు సెక్రెటరీ జనరల్‌కు పంపారు. ఇందులో 2021, డిసెంబర్ 14న న్యాయ స్థానం ఇచ్చిన తీర్పుపై ఆందోళన వ్యక్తం చేశారు. భారత్-చైనా సరిహద్దుకు వెళ్లే 674 కిలోమీటర్ల రోడ్లను డబుల్ లేన్-పేవ్డ్ షోల్టర్ (డీఎల్-పీఎస్) కాన్ఫిగరేషన్ ఆధారంగా 10 మీటర్ల తారు ఉపరితలం వరకు విస్తరించడానికి ఈ తీర్పునిచ్చారు. హైవే వెడల్పును 5.5 మీటర్లకు పరిమితం చేసే 2020, సెప్టెంబర్ 8 నాటి కోర్టు ఉత్తర్వును ఈ తీర్పు మార్చింది. దీంతో దీనిపై రవి చోప్రా తన ఆందోళనను లేఖలో పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక ఆయుధాలతో సహజమైన అడవులను నరికివేసి, దుర్బలమైన హిమాలయ వాలలును హైవేలు విస్తరించే విధానం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి పేరుతో పర్యావరణానికి నష్టం కలిగించే చర్యలను ఆయన తప్పుబట్టారు.