Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని శిక్షించాలి :
ఎస్కేఎం నేత హన్నన్ మొల్లా పిలుపు
న్యూఢిల్లీ : రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిన బీజేపీకి ఓటు వేయొద్దని ఎస్కేఎం నేత హన్నన్ మొల్లా పిలుపు ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని శిక్షించాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్ (అక్బర్పూర్)లో అజంగఢ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నేతలు హన్నన్ మోలా, యోగేంద్ర యాదవ్, ముకుత్ సింగ్, దీపక్ లాంబా, శశికాంత్, విమల్ త్రివేది, సంగ్రామ్ సత్యదేవ్ పాల్, రాజేశ్ ఆజాద్ తదితరులు మాట్లాడారు. తొలుత హన్నన్ మొల్లా మాట్లాడుతూ ఉద్యమం విరమించే సమయంలో ఇచ్చిన లిఖితపూర్వక హామీలను బీజేపీ ప్రభుత్వం నెరవేర్చలేదు. అందువల్ల ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయకూడదని పిలుపు ఇచ్చారు. ''ప్రభుత్వం ఇచ్చిన హామీని తుంగలో తొక్కింది. ఎంఎస్పీపై కమిటీ వేయలేదు. ఆందోళన సమయంలో రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోలేదు. అమరులైన రైతుల కుటుంబాలకు పరిహారం అందజేయలేదు'' అని విమర్శించారు. అందుకు భిన్నంగా లఖింపూర్ ఖేరీ ప్రధాన కుట్రదారుడు అజరు మిశ్రాను మంత్రి మండలి నుంచి తొలగించకుండా, నలుగురు రైతులను, ఒక జర్నలిస్టును హత్య చేసిన కేసులో దోషిగా తేలిన మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రాకు బెయిల్ మంజూరు చేసి రైతుల గాయాలపై కారం చల్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు.''మేం ఏ పార్టీకి ఓట్లు అడగడం లేదు. రైతు ఉద్యమానికి ద్రోహం చేసిన బీజేపీని ఎన్నికల్లో శిక్షించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం'' అని యోగేంద్ర యాదవ్ అన్నారు. ''యువత ఉపాధి కోరుతున్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ద్రవ్యోల్బణం తారాస్థాయికి చేరింది. చెరకు రైతులకు బకాయిల చెల్లింపు ఆగిపోయింది. మేము చెరకు గురించి మాట్లాడినప్పుడు, బీజేపీ నేతలు జిన్నాపై విరుచుకుపడ్డారు. ప్రజా సమస్యలు గురించి అడిగినప్పుడు హిజాబ్ మాట్లాడుతున్నారు. అయితే ఈసారి బీజేపీ ఉచ్చులో ప్రజానీకం పడకుండా ఉంటుంది'' అని ఆశాభావం వ్యక్తం చేశారు. రామ్ మనోహర్ లోహియాను గుర్తుచేసుకుంటూ ఆయన జన్మస్థలం అక్బర్పూర్ ప్రజలు మత శక్తుల ఉచ్చులో పడరని అన్నారు. బీజేపీ దుశ్చర్యలను శిక్షించడంలో ఇక్కడి ప్రజలు చరిత్ర సృష్టిస్తారన్నారు. అక్బర్‌పూర్‌లోని రామ్మనోహర్ లోహియా స్మారక చిహ్నం వద్ద రైతు నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు.