Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : రష్యాకు వ్యతిరేకంగా అమెరికా, ఈయూ దేశాలు విధిస్తున్న ఆంక్షలు..భారత్‌పైనా తీవ్ర ప్రభావం చూపుతాయని ఆర్థిక నిపుణులు అంచనావేస్తున్నారు. ముఖ్యంగా భారత్ ఇంధన అవసరాలు, ఆహార దిగుమతులు అత్యంత ఖరీదుగా మారుతాయని, దేశ ఆర్థిక వ్యవస్థలోనూ అనూహ్య మార్పులు ఏర్పడతాయని నిపుణులు భావిస్తున్నారు. రష్యాను 'స్విఫ్ట్' (అంతర్జాతీయ నగదు లావాదేవీల వేదిక) నుంచి బహిష్కరించిన నేపథ్యంలో ప్రపంచ ఆర్థికరంగంలో పెను తుఫాన్ సంభవించవచ్చు. రష్యా, ఉక్రెయిన్ గోధుమ ఎగుమతుల్లో పావువంతు ఇంకా నౌకలకు ఎక్కలేదు. ఐరోపా గోధుమ, బార్లీ, మొక్కజొన్న అవసరాలు ప్రధానంగా ఉక్రెయిన్ ద్వారానే తీరుతున్నాయి. ఇప్పుడు రష్యాపై అమెరికా, ఈయూ సమాఖ్య విధించిన ఆంక్షలు ముందు ముందు పరిస్థితిని మరింత దిగజార్చుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రపంచంలో గోధుమ, మొక్కజొన్న ఉత్పత్తిలో రష్యా, ఉక్రెయిన్లది అతిపెద్ద వాటా. ఆంక్షల వల్ల ఈ వీటి సరఫరా గొలుసు దెబ్బతినటం భారత్‌లాంటి దేశాలకు అనేక సమస్యలు తెచ్చిపెడుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల పోలింగ్ ముగిసిన మరుక్షణం ధరల పోటు ఉంటుందని వార్తలు వెలువడు తున్నాయి. ద్రవ్యోల్బణం, ఇంధన ధరల పెంపు, నిత్యావసర సరుకుల ధరల పెంపు..ఇవన్నీ ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఖాతాలో వేయడానికి మోడీ సర్కార్ సిద్ధమైందని ఢిల్లీ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.స్విఫ్ట్ వేదిక నుంచి రష్యాను తొలగించటం భారతీయ బ్యాంకులపైనా ప్రభావం పడనున్నది. భారత్-రష్యా వాణిజ్య లావాదేవీలు ఎస్బీఐ, కెనరా, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ..వంటి ప్రఖ్యాత బ్యాంకుల ద్వారా జరుగుతున్నాయి. ఇరు దేశాల వాణిజ్యం నేపథ్యంలో భారత్‌కు చెందిన చిన్న, పెద్దా ఎగుమతిదార్లకు ఈ బ్యాంకుల నుంచి భారీ మొత్తంలో రుణాలు అందాయి. స్విఫ్ట్ నుంచి హఠాత్తుగా రష్యాను తొలగించటం ద్వారా ఆ ఎగుమతిదార్ల వాణిజ్యం ప్రమాదంలో పడింది.
అన్నింటికీ సిద్ధమై అడుగేసిన రష్యా!
అంతర్జాతీయ బ్యాంకు చెల్లింపుల మధ్యవర్తి వేదిక అయిన 'స్విఫ్ట్' నుంచి రష్యాను ఈయూ, అమెరికా, ఇతర దేశాలు వెలివేశాయి. రెండొందల దేశాలకు చెందిన 11వేల బ్యాంకులు, ఆర్థిక సంస్థలు స్విఫ్ట్‌లో సభ్యులుగా ఉన్నాయి. ఒక దేశం నుంచి మరో దేశానికి సులువుగా డబ్బు బదిలీ కావడానికి 'స్విఫ్ట్' వ్యవస్థ తోడ్పడుతుంది. గోధుమ, చమురు, సహజవాయువు, ఇతర వ్యాపార సరుకుల చెల్లింపులు..ఇదంతా కూడా 'స్విఫ్ట్' ద్వారానే జరుగుతాయి. ఇంత కీలకమైన 'స్విఫ్ట్' వేదిక నుంచి రష్యాను తొలగించటం ఆ దేశ కరెన్సీ రూబల్ను దారుణంగా పతనం అయ్యేలా చేసింది. అయితే ఈ ఆంక్షల్ని, వీటి ప్రభావాన్ని ముందుగానే రష్యా అంచనావేసిందని, అంతర్జాతీయ వాణిజ్యంలో రష్యా ప్రయోజనాలు దెబ్బతినకుండా చైనా, సౌదీ అరేబియా, ఇతర దేశాలతో పుతిన్ ఏర్పాట్లు చేసుకున్నారని వార్తా కథనాలు వెలువడుతున్నాయి. ఉదాహరణకు చైనా, తన మిత్ర దేశాలతో చమురు, ఆహార ఎగుమతులు డాలర్లలో కాకుండా రూబుల్లో ఉండేట్టు ఒప్పందాలు ఉన్నాయని సమాచారం.