Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల్లో ...
- 117నుంచి 120కి భారత్ స్థానం : ఇండియాస్ ఎన్విరాన్మేంట్ రిపోర్ట్
- మెరుగైన ర్యాంక్‌లో భూటాన్, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్
- రాష్ట్రాల్లో మొదటి స్థానంలో నిలిచిన కేరళ
న్యూఢిల్లీ : ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల సాధనలో భారత్ దారుణంగా వెనుకబడింది. 17 విభాగాల్లో మొత్తం 100మార్కులకుగానూ భారత్ 66మార్కులు సాధించిందని 'ఇండియాస్ ఎన్విరాన్మేంట్ రిపోర్ట్, 2022' తాజా నివేదిక పేర్కొన్నది. ఈ నివేదిక ప్రకారం భారత్ ర్యాంక్ 117 నుంచి 120కి పడిపోయింది. భారత్‌లో రాష్ట్రాల వారీగా ర్యాంకులు విడుదల చేయగా, అభివృద్ధి లక్ష్యాల సాధనలో కేరళ మొదటిస్థానంలో, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ రెండో స్థానంలో నిలిచాయి. నాణ్యమైన విద్య, పేదరిక నిర్మూలన, అందరికీ ఆహార భద్రత, లింగ సమానత్వం..మొదలైన 17 విభాగాల్లో ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల్ని సాధిస్తామనే తీర్మానంపై 2015లో భారత్ సహా 192 దేశాలు సంతకం చేశాయి. ఈ లక్ష్యాల్ని ఆయా దేశాల ఏమేరకు సాధిస్తున్నాయనేది పలు అంతర్జాతీయ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు నివేదికలు విడుదల చేస్తున్నాయి. ఈనేపథ్యంలో విడుదలైన 'ఇండియాస్ ఎన్విరాన్మేంట్ రిపోర్ట్, 2022' ఆయా దేశాలకు ర్యాంకుల్ని వెల్లడించింది.
11విభాగాల్లో సవాళ్లు
ఈ నివేదిక ప్రకారం, అభివృద్ధి లక్ష్యాల సాధనలో భారత్‌కు పొరుగున వున్న పలు దేశాలు మెరుగైన ఫలితాల్ని సాధించాయి. భూటాన్-75, శ్రీలంక-87, నేపాల్-96, బంగ్లాదేశ్-109 ర్యాంకులు పొందాయి. భారత్‌కన్నా దిగువన పాకిస్థాన్ 129వ ర్యాంక్ అందుకుంది. ఈ నివేదికను కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ మంగళవారం విడుదల చేశారు. అత్యంత ముఖ్యమైన..ఆకలి నిర్మూలన, ఆరోగ్యం, సంరక్షణ, లింగ సమానత్వం, నగరాలు, సామాజికవర్గాలు..తదితర 11విభాగాల్లో భారత్ అనేక సవాళ్లు ఎదుర్కొంటోందని, అందువల్లే భారత్ ర్యాంక్ పడిపోయిందని నివేదిక పేర్కొన్నది. అందుబాటులో నాణ్యమైన విద్య, జీవన ప్రమాణాలు, భూ హక్కులు..తదితరమైన వాటిల్లోనూ భారత్ ప్రదర్శన పేలవంగా ఉందని తేలింది. ఇక రాష్ట్రాల వారీగా చూస్తే, అభివృద్ధి లక్ష్యాల సాధనలో కేరళ మొదటి స్థానంలో, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ రెండో స్థానంలో ఉన్నాయి. గోవా, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్ మూడో స్థానంలో నిలిచాయి. జార్ఖాండ్, బీహార్ అట్టడుగున ఉన్నాయి. ప్రపంచంలో శాంతిసామరస్యం నెలకొనాలంటే, 17 స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల్ని అన్ని దేశాలూ సాధించాల్సి వుంటుందని, వీటిపై కార్యాచరణ వెంటనే ప్రారంభించాలని తీర్మానంలో ఐక్యరాజ్యసమితి పేర్కొన్నది.