Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖర్కివ్‌లో ప్రభుత్వ భవనాలపై క్షిపణి దాడి
- 70 మంది సైనికులు మృతి
- ఆరుగురు పౌరులకు గాయాలు
- లక్ష్యం పూర్తయ్యేదాకా ఆపరేషన్ : రష్యా
- ఒంటరి చేయొద్దని ఇయుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ వినతి
కీవ్/మాస్కో/న్యూఢిల్లీ : ఉక్రెయిన్ రావణకాష్టంగా రగులుతూనేవుంది. సైనిక చర్యలో భాగంగా రష్యా మంగళవారం కూడా వివిధ ప్రాంతాల్లో దాడులు జరిపింది. రెండో అతిపెద్ద నగరమైన ఖర్కివ్‌లో ప్రభుత్వ భవన సముదాయాలను లక్ష్యంగా చేసుకొని జరిపిన క్షిపణి దాడుల్లో పలు భవనాలు, వాహనాలు ధ్వంసమయ్యయి. 70 మంది వరకూ సైనికులు చనిపోయారు. ఒక చిన్నారి సహా ఆరుగురు పౌరులు గాయపడ్డారు. ఒక పేలుడు ఘటనలో కర్నాటక విద్యార్థి ఒకరు చనిపోయినట్టు భారత విదేశాంగ శాఖ మంగళవారం ధ్రువీకరించింది. మరోవైపు తమ లక్ష్యం పూర్తయ్యేదాకా సైనిక ఆపరేషన్ కొనసాగుతుందని రష్యా ప్రకటించింది. ఇదే నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ తమ దేశానికి ఇస్తున్న మద్దతును నిరుపించుకునే చర్యలు చేపట్టాలని కోరారు. ఈ నేపథ్యంలో అంతర్గతంగా ముగిసిన చర్చలను గురువారం నుంచి పున:ప్రారంభించేందుకు రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధులు సమ్మతి తెలియజేశారు.
ఖర్కివ్ నగరం రష్యా సరిహద్దుకు సుమారు 40 కిమీ దూరంలో ఉంది. ప్రభుత్వ భవనాలను లక్ష్యంగా చేసుకొని దూసుకొస్తున్న క్షిపణలు, భారీ పేలుళ్లతో కూడిన సిసిటివి వీడియో దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. రష్యన్ బలగాలే ఈ క్షిపణి దాడులకు పాల్పడినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. ఆరుగురు పౌరులు తీవ్రంగా గాయపడ్డారని తెలిపింది. స్థానిక ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆదేశించింది. గత గురువారం రష్యా సైనిక ఆపరేషన్ చేపట్టిననాటి నుంచి ఇప్పటి వరకూ 352 మంది పౌరులు చనిపోయారని, వీరిలో 14 మంది చిన్నారులున్నారని ఉక్రెయిన్ ప్రభుత్వం తెలిపింది.
భద్రత లక్ష్యాలు చేరుకునేదాకా ఆపరేషన్
పశ్చిమ దేశాల నుంచి పొంచివున్న ప్రమాదాలను తిప్పికొట్టే క్రమంలో తనను తాను రక్షించుకునేందుకు అవసరమైన ప్రధాన లక్ష్యాన్ని చేరుకునేవరకూ ఉక్రెయిన్‌లో చేపట్టిన ప్రత్యేక సైనిక ఆపరేషన్ కొనసాగుతుందని రష్యా రక్షణ శాఖ మంత్రి సెర్జారు షోయిగు మంగళవారం తెలిపారు. 'పశ్చిమ దేశాల నుంచి పొంచివున్న సైనిక పరమైన మప్పు నుంచి రక్షించుకోవడమే రష్యా ముందున్న ప్రధానలక్ష్యం. మా దేశంపై పోరాడేందుకు పశ్చిమ దేశాలు ఉక్రెయిన్ ప్రజానీకాన్ని పావుగా వాడుకోవాలని చూస్తున్నాయి. ఈ దుర్మార్గాన్ని సహించం. ఈ ముప్పును తిప్పికొట్టేదాకా ఆపరేషన్ కొనసాగుతుంది' అని షోయిగు తెలిపారు. రక్షణ శిబిరాలను లక్ష్యంగా చేసుకొని మాత్రమే తమ ఆపరేషన్ కొనసాగుతోందని ఆయన స్పష్టం చేశారు. అది కూడా అత్యంత ప్రమాదకరమైన ఆయుధులున్న శిబిరాలేనని పేర్కొన్నారు.
మీరు లేకుంటే మేం ఒంటరే : జెలెన్స్కీ
పశ్చిమ దేశాల వంచన పూరిత ఎత్తుగడులను ఒకవైపు రష్యా ఎత్తిచూపుతున్నా..ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వైఖరిలో మార్పు రావడం లేదు. యూరోపియన్ యూనియన్ దేశాల మద్దతు లేకుండా తాము లేమని ఆయన ప్రకటించుకున్నారు. మంగళవారం ఇయు పార్లమెంటును ఉద్దేశించి వీడియో లింక్ ద్వారా జెలెన్స్కీ ప్రసంగించారు. 'మీరు (ఇయు) లేకపోతే ఉక్రెయిన్ ఒంటరిగా మిగిలిపోతుంది. మీరు మాతో ఉన్నట్టు నిర్ధారించే చర్యలు చేపట్టండి. మమ్మల్ని ఒంటరిగా వదిలేయబోమని ధ్రువీకరించండి. మరణంపై జీవం, చీకటిపై వెలుగు విజయం సాధిస్తాయన్న విషయాన్ని ఐరోపియన్లుగా రుజువు చేయండి. ఉక్రెయిన్ వైభవాన్ని కాపాడండి' అని ఆయన కోరారు.
తక్షణమే నిలిపేయండి : ఐరాస
ఉక్రెయిన్‌లో సైనిక ఆపరేషన్‌ను తక్షణమే నిలిపివేయాలని ఐక్యరాజ్యసమితి ప్రధానకార్యదర్శి ఆంటోనియా గుటెర్రాస్ పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ సంక్షోభంపై సోమవారం నిర్వహించిన ఐరాస అత్యవసర ప్రత్యేక సమావేశంలో ఆయన ప్రసగించారు. 'ఉక్రెయిన్‌లో తక్షణమే యుద్ధాన్ని నిలిపేయాలి. వాయు, భూమి, నావికా త్రివిధాలుగా ఉక్రెయిన్ అంతంటా సైనిక ఆపరేషన్లు విస్తరిస్తున్నాయి. వీటిని తక్షణమే ఆపేయాలి' అని ఆయన కోరారు. జరిగిందేదో జరిగిపోయింది. సైనికులందరూ వారివారి శిబిరాలకు వెళ్లిపోవాలి. నాయకులు శాంతిమార్గం పట్టాలి. పౌరులను కచ్చితంగా పరిరక్షించాలి' అని గుటెర్రాస్ నొక్కి చెప్పారు. అలాగే రష్యా అణ్వాయుధ బలగాలను హైఅలర్ట్ చేసిందనీ, అణ్వాయుధాలు వినియోగించడం వల్ల జరిగేదేదీ న్యాయం కాబోదని స్పష్టం చేశారు.
యుద్ధ నేరాలపై దర్యాప్తుకు ఐసీసీ సమాయత్తం
ఉక్రెయిన్‌లో జరుగుతున్న సైనిక ఆపరేషన్లలో చోటుచేసుకునే యుద్ధ నేరాలపై దర్యాప్తు చేపడుతామని అంతర్జాతీయ నేరాల న్యాయస్థానం (ఐసిసి) ప్రకటించింది. ఉక్రెయిన్ను కక్షిదారుగా చేర్చకుండానే తామే వీలైనంత త్వరగా దర్యాప్తును ప్రారంభిస్తామని ఐసిసి దర్యాప్తు అధికారి కరీం ఖాన్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.