Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కల్లోలితంగా మారిన ఉక్రెయిన్‌లో మంగళవారం భారత్‌కు చెందిన విద్యార్థి ఒకరు చనిపోయారు. ఈ విషయాన్ని విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) ధ్రువీకరించింది. బాధిత విద్యార్థిని కర్ణాటకకు చెందిన ఎస్జి నవీన్‌గా గుర్తించారు. ఖర్కివ్‌లో చదువుతున్న నవీన్.. మంగళవారం ఉదయం ఆహారం కోసం వరుసలో నిలబడి ఎదురుచూస్తున్న సమయంలో దాడి జరగడంతో చనిపోయినట్టు ఎంఈఏ నిర్ధారించింది. 'మంగళవారం ఉదయం ఖర్కివ్‌లో జరిగిన దాడుల్లో భారత విద్యార్థి ఒకరు చనిపోయారని ప్రకటిస్తున్నందుకు చాలా బాధపడుతున్నాం. బాధిత విద్యార్థి కుంటుంబానికి మంత్రిత్వ శాఖ అందుబాటులో ఉంది. కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం' అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందం బగ్చి తెలిపారు. విషయం తెలుసుకున్న వెంటనే నవీన్ తండ్రితో కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మాట్లాడారు. నవీన్ భౌతికకాయాన్ని తీసు కొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఘర్షణాత్మక ప్రాంతాల్లో ఉన్న భారతీయులను సురక్షితంగా తరలించే విషయమై రష్యా, ఉక్రెయిన్ దౌత్యవేత్తలతో విదేశాంగ కార్యదర్శి సంప్రదింపులు జరుపుతున్నారని, అలాగే రష్యా, ఉక్రెయిన్‌లో ఉన్న భారత దౌత్యవేత్తలు కూడా సంబంధిత అధికారులుతో చర్చలు జరుపుతున్నారని పేర్కొన్నారు.