Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ, రెవెన్యూ శాఖల మధ్య పంచాయితీ
- పీఎం కిసాన్ పథకం అమలులో నష్టపోతున్న 'మహా' రైతులు
- పెండింగ్‌లో ఎనిమిది లక్షల మందికి పైగా దరఖాస్తులు
ముంబయి : మహారాష్ట్రలో రెండు శాఖల మధ్య వార్ రైతుల పాలిట శాపంగా మారింది. కేంద్ర ప్రభుత్వ పథకం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పీఎం కిసాన్) కింద అందే ప్రయోజనాలకు వారు దూరమవుతున్నారు. దీని ప్రభావం దాదాపు ఎనిమిది లక్షల మంది రైతులపై పడింది.
మంత్రులు రంగంలోకి దిగినా..!
పీఎం కిసాన్ పథకం కింద దేశవ్యాప్తంగా రైతులకు ఏడాదికి మూడు విడతాల్లో రూ. 6000 వారి ఖాతాల్లో పడుతుంది. గతేడాది ఈ పథకం అమలులో దేశవ్యాప్తంగా మహారాష్ట్ర మంచి ప్రదర్శనను కనబర్చింది. అయితే, ఈ పథకాన్ని ఇంత మంచిగా అమలు చేసిన ఘనత తమకే దక్కుతుందని వ్యవసాయ, రెవెన్యూ విభాగాలు ఘర్షణ పడుతున్నాయి. దీంతో ఎనిమిది లక్షల మం ది రైతులు ఈ పథకం కింద పొందే ప్రయోజనాలకు దూరమయ్యే ప్రమాదం ఏర్పడింది. రెండు శాఖల మధ్య ఏర్పడిన 'క్రెడిట్ వార్'కు ముగింపు పలికేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు మంత్రులు రంగంలోకి దిగారు. అయినప్పటికీ ఈ వివాదంలో ఇప్పటికీ పరిష్కారం దొరకలేదు.
పనికి మేము.. ప్రైజ్‌లకు వ్యవసాయ శాఖనా..? : రెవెన్యూ విభాగం
రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం.. పీఎం కిసాన్ పథకం కింద రాష్ట్రంలోని ఐదు కోట్ల ఐదు లక్షల మంది రైతులు రూ. 17వేల కోట్లకు పైగా మొత్తాన్ని పొందారు. పథకాన్ని చక్కగా అమలు పరిచినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి మూడు ప్రైజ్‌లు వచ్చాయి. అయితే, ఈ ప్రైజ్‌లను స్వీకరించడానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, అధికారులు మాత్రమే వెళ్లారు. రెవెన్యూ శాఖ క్షేత్రస్థాయిలో పనిచేసినప్పటికీ గుర్తింపు రాకపోవడంపై ఆ శాఖ అధికారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ''ఈ పరిస్థితులతో రెవెన్యూ శాఖ అధికారులు ఆగ్రహంతో, అసంతృప్తితో ఉన్నారు. పథకాన్ని అమలు పరిచడంలో వారు పేపర్ వర్క్ చేశారు. అయితే, అవార్డు స్వీకరణకు వచ్చే సమయానికి రాష్ట్ర వ్యవసాయ మంత్రి, వ్యవసాయ సెక్రెటరీ, కమిషనర్లు మాత్రమే వెళ్లారు. ఏమి పని చేయకుండానే ఈ పథకం అమలులో రాష్ట్ర వ్యవసాయ శాఖ క్రెడిట్‌ను పొందిందని రెవెన్యూ శాఖ అధికారులు భావిస్తున్నారు'' అని ముంబయిలోని మహా వికాస్ అఘాడీ (ఎంబీఏ)లోని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఏఐకేఎస్ ఆగ్రహం
అయితే, ప్రస్తుత పరిస్థితులపై రైతులు, రైతు సంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వ తీరును విమర్శించారు. రెండు విభాగాల మధ్య సమన్వయ, సమచార లోపం ఉండటంపై ఎంవీఏ ప్రభుత్వాన్ని ఆలిండియా కిసాన్ సభ (ఏఐకేఎస్) నిందించింది. '' కేంద్ర పథకం రైతులకు కంటి తుడుపు చర్యే. అయినా.. రెండు శాఖ మధ్య ఘర్షణ రైతులకు వచ్చే కొద్ది పాటి సాయంపై ప్రభావం చూపుతున్నది. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి, ఆయన మంత్రులది'' అని ఏఐకేఎస్ రాష్ట్ర సెక్రెటరీ డాక్టర్ అజిత్ నావలే అన్నారు.ఈ వివాదం కారణంగా ఈ పథకం కింద రాష్ట్రంలోని ఎనిమిది లక్షల మందికి పైగా రైతుల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. మార్చి 15 నాటికి పీఎం కిసాన్ పథకం కింద మొదటి ఇన్స్టాల్మెంట్ రైతుల ఖాతాల్లోకి చేరుతుంది. దీంతో దరఖాస్తుల పెండింగ్ కారణంగా ఆ రైతులు మొదటి ఇన్‌స్టాల్‌మెంట్‌కు దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.