Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్యారెల్కు 110 డాలర్లుకు పైగానే..!
- రష్యా నుంచి సరఫరాకు అంతరాయం
- రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం
న్యూఢిల్లీ : రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు క్రూడాయిల్ ధరలపై పడింది. రష్యా నుంచి ముడి చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడే భయాందోళనల నేపథ్యంలో క్రూడాయిల్ రేట్లకు రెక్కలు వచ్చాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధర 110 డాలర్లకు పైగా చేరింది. భారత కరెన్సీలో ఇది రూ. 8,318. ప్రపంచంలోనే రష్యా మూడో అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుగా ఉన్న విషయం విదితమే. డబ్ల్యూటీఐ ఐదు డాలర్లు (రూ. 378.23) పెరిగి 108.64 డాలర్లు (రూ. 8,218.13)కు చేరింది. 5.06శాతం పెరుగుదల నమోదైంది. ఆయిల్ ధరలు ఏడేండ్ల గరిష్టానికి చేరుకున్నాయని ఏజెన్స్ ఫ్రాన్స్-ప్రెస్సి తెలిపింది. కాగా, ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. దీంతో రానున్న రోజుల్లో చమురు ధరల పెరుగుదల కొనసాగే అవకాశమున్నదని అంతర్జాతీయ నిపుణులు తెలిపారు. పెరిగిన చమురు ధరల ప్రభావం అంతర్జాతీయంగా అనేక దేశాలపై ప్రభావం చూపుతున్నదని చెప్పారు. ప్రస్తుతం డిమాండ్ మేరకు ఇంధనం సరఫరా కావడం లేదు. ముడి చమురు ధరలు రాబోయే రోజుల్లో 150 డాలర్లు దాటవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రష్యా తక్కువ ధరకే చమురును అందించినా.. అమెరికా, యూరోపియన్ యూనియన్ విధించిన ఆంక్షల కారణంగా ఎవరూ కొనుగోలు చేయడం లేదు. ఇటు రష్యా నుంచి సరఫరాకు అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురుకు డిమాండ్ పెరిగింది. దీంతో గల్ఫ్ దేశాలూ చమురు ధరలను పెంచుతున్నాయి. చమురు ధరల పెరుగుదల ఇలాగే కొనసాగితే త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తే అవకాశమున్నదని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరించారు.