Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు : ఉక్రెయిన్‌లో చనిపోయిన కర్నాటకకు చెందిన విద్యార్థి నవీన్ పట్ల కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అత్యంత అమానవీయమైన వ్యాఖ్యలు చేశారు. దేశంలో వైద్య విద్యలో సీటు రాక, ఇక్కడ వైద్యుణ్ని కాలేననే నవీన్ ఉక్రెయిన్ వెళ్లాడనీ, ఏదో సాదిద్దామని ఉక్రెయిన్ వెళ్లి అక్కడే చనిపోయాడని ఆయన చాలా వ్యంగ్యంగా వ్యాక్యానించారు. దేశంలో వైద్య విద్య కోసం విదేశాలు వెళుతున్నవారిలో 90 శాతం మంది మన దేశం నిర్వహించే నీట్లో ఉత్తీర్ణులు కానివారేనని ఆయన పేర్కొన్నారు. జోషి వ్యాఖ్యలను పౌర సమాజం, ప్రతిపక్షాల తీవ్రంగా ఖండించాయి. ఉక్రెయిన్‌లో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులను క్షేమంగా తిరిగొచ్చేందుకు ఏర్పాట్లుచేయాల్సిన ప్రభుత్వ పెద్దలు ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలపైనే ప్రధాని మోడీ దృష్టి పెట్టారని విమర్శిస్తున్నారు. అలాగే, ఉక్రెయిన్‌లో భారత రాయబార కార్యాలయం తమ ఫోన్లకు, మెసేజ్‌లకు స్పందించడం లేదని స్వదేశం తిరిగివచ్చిన భారతీయ విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
మరో విద్యార్థి మృతి
ఉక్రెయిన్‌లో మరో భారతీయ విద్యార్ధి మృతి చెందారు. అక్కడి భయానక పరిస్థితుల నేపథ్యంలో పంజాబ్‌కు చెందిన చందన్ బిందాల్ అనే విద్యార్థి బ్రెయిన్ స్ట్రోక్‌తో చనిపోయారు. చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకుని వెళ్లినా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది.