Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసెంబ్లీ మార్చ్‌ను అడ్డుకున్న ఖాకీలు
- నిరసనకారులపై లాఠీచార్జీ
- హర్యానా ప్రభుత్వంపై సీఐటీయూ ఆగ్రహం
చండీగఢ్ : హర్యానాలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లపై అక్కడి ఖాకీలు తమ ప్రతాపం చూపారు. డిమాండ్ల పరిష్కారం కోసం నిరసనచేస్తున్న వారిని పోలీసులు నిర్బంధించారు. పాదయాత్రగా చండీగఢ్‌లోని రాష్ట్ర అసెంబ్లీకి చేరుకొని నిరసన చేయడానికి యత్నించిన నిరసనకారులను మధ్యలోనే అడ్డుకున్నారు. పంచ్‌కుల-యముననగర్ జాతీయ రహదారిపై బర్వాలా టోల్ ప్లాజా వద్ద నిరసనలో పాల్గొన్న మహిళలపై స్వల్ప లాఠీ చార్జీ జరిగిందని కార్మిక నాయకులు తెలిపారు.
గతేడాది డిసెంబర్ 8 నుంచి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు నిరసనలో ఉన్నారు. సీఐటీయూ మద్దతు కలిగిన హర్యానా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (హెచ్ఏడబ్ల్యూహెచ్యూ), ఏఐయూటీయూసీ మద్దతు కలిగిన అంగన్వాడీ కార్యకర్త సహాయిక యూనియన్ (ఏకేఎస్యూ) ల నాయకులు, కార్యకర్తలు.. చండీగఢ్‌లోని అసెంబ్లీ బయట నిరసన ప్రదర్శనకు వెళ్లే ముందు పంచకుల బస్టాండ్ వద్ద గల పార్కులో సమావేశమయ్యారు. కాగా, వారిని అసెంబ్లీకి చేరనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు.
హర్యానా అసెంబ్లీ బడ్జెట్ సెషన్ బుధవారం ప్రారంభమైంది. నెలవారి గౌరవవేతనాన్ని పెంచాలనీ మనోహర్‌లాల్ ఖట్టర్ ప్రభుత్వాన్ని నిరసన చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. గౌరవ వేతనం పెంపుపై కేంద్రం 2018లో హామీ ఇచ్చిన విషయాన్ని వారు గుర్తు చేశారు. అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లను తీసుకొస్తున్న వాహనాలను పోలీసులు అడ్డుకున్నారని హెచ్ఏడబ్ల్యూహెచ్యూ నాయకులు ఆరోపించారు. పల్వాల్, రేవారి, మహేందర్‌గర్ తో పాటు పలు జిల్లాల్లో అనేక మంది వర్కర్లు, హెల్పర్లను నిర్బంధించారని చెప్పారు. పోలీసు చర్య ఎదురైన బర్వాలా టోల్ ప్లాజా వద్దకు సమీప జిల్లాలైన యమునానగర్, రోహతక్, దాద్రి ల నుంచి వందలాది మంది అంగన్వాడీ కార్యర్తలు చేరకున్నారని సీఐటీయూ-హర్యానా రాష్ట్ర అధ్యక్షులు సురేఖ తెలిపారు. ''పోలీసులు మమ్మల్ని ఆపారు. లాఠీచార్జీ చేశారు. అనేక మంది గాయాలపాలయ్యారు'' అని ఆమె అన్నారు. '' ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అనేక జిల్లాల నుంచి 300 మందికి పైగా వర్కర్లు, హెల్పర్లను తీసేసింది. అయినా మేము వెనక్కి తగ్గం'' అని తెలిపారు.
సీఐటీయూ ఖండన
అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లపై పోలీసుల చర్యను సీఐటీయూ తీవ్రంగా ఖండించింది. బీజేపీ ప్రభుత్వ చర్యను తప్పుబట్టింది. నిరసనకారులతో చర్చలు జరపడానికి బదులు వారిపై ఇలాంటి చర్యలకు దిగుతున్నదన్నది. రాష్ట్ర ప్రభుత్వం వర్కర్లపై నిస్సిగ్గుగా ఎస్మాను ప్రయోగించిందని ఒక ప్రకటనలో పేర్కొన్నది. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలనీ, చర్చలు జరిపి సమస్యకు పరిష్కారం కనుగొనాలని అభ్యర్థించింది. సీఐటీయూ జాతీయ సెక్రెటరీలు ఏ.ఆర్.సింధూ, ఉషా రాణి, ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ (ఏఐఎఫ్‌ఏడబ్ల్యూహెచ్) జనరల్ సెక్రెటరీ, అధ్యక్షుడితో వందలాది మంది వర్కర్లను బర్వాలా టోల్ గేట్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రదేశాల నుంచి అదుపులోకి తీసుకున్నారు. ఏఐఎఫ్‌ఏడబ్ల్యూహెచ్ కూడా రాష్ట్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించింది. హర్యానా ప్రభుత్వం, సీఎంకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు నిరసన తెలపాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు ఏఐఎఫ్‌ఏడబ్ల్యూహెచ్ జనరల్ సెక్రెటరీ ఏ.ఆర్ సింధూ, ప్రెసిడెంట్ ఉషారాణిలు ఒక ప్రకటనను విడుదల చేశారు.