Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభివృద్ధికి ఆరు నెలల గడువు
- సిఆర్డిఎ చట్టం ప్రకారం పనులు
- మూడు నెలల్లో రైతులకు ప్లాట్లు : ఏపీ హైకోర్టు
అమరావతి : ఏపీరాష్ట్రానికి అమరావతే రాజధాని అని హైకోర్టు తేల్చింది. అన్ని వసతులతో రాజధాని నగరాన్ని ఆరు నెలల్లోగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు వివిధ కీలక అంశాలతో కూడిన తీర్పును హైకోర్టు చీఫ్ జస్టిస్ పికె మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ ఎం. సత్యనారాయణ మూర్తి, జస్టిస్ డివిఎస్ సోమయాజులతో కూడిన త్రి సభ్య ధర్మాసనం గురువారం ప్రకటించింది. ' సిఆర్డిఎ చట్టం ప్రకారం జరిగిన ల్యాండ్ పూలింగ్ ఒప్పందం నుండి వెనక్కి రావడం సాథ్యం కాదు. అది వెనక్కి తీసుకోవ డానికి వీలులేనిది.ఆ ఒప్పందంలో పేర్కొన్న విధంగా అమరావతి రాజధాని నగరాన్ని, రాజధాని ప్రాంతాన్ని ఆరు నెలల్లో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నాం.' అని ధర్మాసనం పేర్కొంది. సిఆర్డిఎ చట్టంలోని 61వ సెక్షన్లో పేర్కొన్న విధంగా రాజధాని నగరం ప్రణాళిక ఉండాలని కోర్టు నిర్ధేశించింది. పాలన వికేంద్రీకరణ, సిఆర్డిఎ రద్దు తదితర అంశాలపై పలు పిటిషన్లు హైకోర్టులో దాఖలైన సంగతి తెలిసిందే. ఆ చట్టాలను ప్రభుత్వం ఉపసంహరించు కున్నప్పటికీ తాము కోరిన అభ్యర్థనల్లో అనేక అంశాలు మనుగడలోనే ఉన్నాయని, తుది తీర్పు వెలువరించాలని పిటిషనర్లు ధర్యాసనాన్ని అభ్యర్థించారు.ఈ నేపథ్యంలో గురువారం ఉదయం పదన్నర గంటలకు దర్మాసనం ఈ అంశంపై దాఖలైన 70పిటిషన్లను తీర్పు వెలువరించే ప్రక్రియను చేపట్టింది. ఒకదాని తరువాత ఒకటిగా వెలువడిన కీలక ఆదేశాలతో అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేశారు.పెద్ద సంఖ్యలో చేరుకున్న రైతులు హైకోర్టుకు సాష్టంగ నమస్కారం చేశారు. 807 రోజులుగా నిర్వహిస్తున్న దీక్ష శిబిరాల వద్ద సంబరాలు జరుపుకున్నారు.బాణా సంచా కాల్చారు. మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉన్నతాధికారులు, న్యాయనిపు ణులతో పాటు కొందరు మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
వేరే అవసరాలకు తనఖాకు నో
అంతకుముందు హైకోర్టు ధర్మానసం అనేక కీలక ఆదేశాలను జారీ చేసింది. వాటిలో రైతులు పూలింగ్‌లో భాగంగా ప్రభుత్వానికి ఇచ్చిన భూములను రాజధాని అవసరాలకు మినహా ఇతరత్రా వాటికి తనఖా పెట్టడానికి వీలులేదని పేర్కొంది. ఇక్కడి భూములను తనఖా పెట్టి రుణం తేవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ ఆదేశాలు ప్రాధాన్యత నంతరింరించుకున్నాయి. సిఆర్డిఎ చట్టంలోని సెక్షన్ 58, రూల్ 12(6)లో పేర్కొన్న విధంగా రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్‌వంటి సదుపాయాలను ఏర్పాటు చేయాలని ధర్మాసనం పేర్కొంది. కోర్టు తీర్పు వెలువరించిన నెలరోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని పేర్కొంది రైతులకు తిరిగి ఇవ్వాల్సిన ప్లాట్లలో రోడ్లు, తాగునీటి సదుపాయం విద్యుత్ కనెక్షన్లు ప్రతి ప్లాటుకూ ఉండేలా డ్రైనేజీ వ్యవస్థనూ సిఆర్డిఎ నిర్ధేశించిన విధంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా మూడు నెలల్లో ప్లాట్ల పంపిణీ పూర్తి కావాలని తెలిపింది. అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడే నివేదికను సమర్పించాలని ఆదేశించింది. వీటితో పాటు పిటీషన్లు దాఖలు చేసి 64 మంది రైతులకు ఒక్కొక్కరికీ రూ.50 వేల చొప్పున పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చింది.
ఏపీ ప్రభుత్వానికి ఆ అధికారం లేదు
సిఆర్డిఎ మాస్టర్ ప్లాన్‌లో ఉన్నది ఉన్నట్లు అమలు చేయాలని ఆదేశించిన హైకోర్టు రాజధాని పై ఎటువంటి చట్టాలు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. 'లేని అధికారాలతో చట్టాలు రద్దు చేయలేరు. అధికారం లేనప్పుడు సిఆర్డిఎ చట్టం రద్దు కుదరదు. అమరావతి నుండి ఏ కార్యాలయాన్ని తరలించడానికి వీలులేదు' అని పేర్కొంది. ఈ కేసు విచారణ సందర్భంగా ఇద్దరు న్యాయమూర్తులపై ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలను ధర్మాసనం తోసిపుచ్చింది.