Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కంద్ర మంత్రి తనయుడు ఆశిష్ మిశ్రా బెయిల్‌ను సవాల్ చేస్తూ...
- అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన బాధిత రైతు కుటుంబాలు
న్యూఢిల్లీ : లఖింపూర్ ఖేరీ ఘటనలో ప్రధాన నిందితుడు, కేంద్ర హౌం సహాయ మంత్రి అజరు కుమార్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రాకు బెయిల్‌పై విచారణకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. ప్రధాన నిందితుడు, కేంద్ర హౌం శాఖ సహాయ మంత్రి అజరు మిశ్రా తేనీ కుమారుడు ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ లఖింపూర్ ఖేరీలో మృతి చెందిన రైతుల కుటుంబీకులు దాఖలు చేసిన పిటిషన్‌ను మార్చి 11న విచారించేందుకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అంగీకారం తెలిపారు. సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ ముందు పిటిషన్‌ను మౌఖికంగా ప్రస్తావిస్తూ, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కేసును అత్యవసరంగా జాబితా చేయాలని కోరారు. ''ప్రధాన నిందితుడికి పూర్తిగా అదనపు కారణాల వల్ల బెయిల్ మంజూరు చేయబడింది. బెయిల్‌పై బయట ఉన్నప్పుడు నిందితులు సాక్షులను ప్రభావితం చేయవచ్చు, సాక్ష్యాధారాలను తారుమారు చేయవచ్చు'' అని భూషణ్ పేర్కొన్నారు. ఆశిష్ మిశ్రాకు బెయిల్ ఇవ్వడంతో ఈ కేసులోని ఇతర నిందితులు కూడా బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారని అన్నారు. దీనికి స్పందించిన సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ ''మేం మార్చి 11న కేసును విచారిస్తాం'' అని చెప్పారు. ఫిబ్రవరి 10 బెయిల్ ఆదేశాలపై అప్పీల్ చేసినట్టు కుటుంబాలు తెలిపాయి. బెయిల్‌ను ఇవ్వడంలో హైకోర్టు ''ఏకపక్ష'' విచక్షణా అధికారాలను ఉపయోగించిందని పిటిషనర్లు ఆరోపించారు.
వివాదాస్పద వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఆందోళన చేస్తున్న రైతులపై వాహనాలు ఎక్కించి రైతుల మరణాలకు కారణమైన విషయం విదితమే.ఆ దిగ్భ్రాంతికర ఘటనను సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించిందని పిటిషన్లో పేర్కొన్నారు. చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత విచారణ జరిపి, స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేసేందుకు స్వతంత్ర సిట్‌ని ఏర్పాటు చేయాలని గతేడాది నవంబర్ 17న సుప్రీం కోర్టు ఆదేశించిందని తెలిపారు. మంత్రి కుమారుడికి బెయిల్ మంజూరు చేయడం వల్ల కేసు విచారణకు గండి పడుతుందని అన్నారు. ఇప్పటికే జనవరి 3న చార్జిషీట్ దాఖలు చేశారని తెలిపారు. బెయిల్ ఆర్డర్ చట్ట విరుద్ధమని పిటిషనర్లు పేర్కొన్నారు. జనవరి 18న బెయిల్‌పై తుది విచారణకు ముందు కూడా చార్జిషీట్ దాఖలు చేసిన విషయాన్ని రికార్డుల్లోకి తీసుకురాలేదని తెలిపారు. ''చార్జిషీట్లో నిందితులకు వ్యతిరేకంగా ఉన్న అధిక సాక్ష్యాలను హైకోర్టు పరిగణించలేదు'' అని పిటిషనర్లు వాదించారు.