Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ : మెడికల్ పీజీ సీట్ల ఆశావాహులు, మెడికల్ అసోసియేషన్లు చేసిన విజ్ఞప్తులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. దేశవ్యాప్తంగా ఏటా మెడికల్ పీజీ సీట్లు వేలాదిగా మిగిలిపోతున్న క్రమంలో కౌన్సిలింగ్కు అందరినీ అనుమతించాలంటూ తెలంగాణ,ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రకు చెందిన విద్యార్థులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను శుక్రవారం జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్లతో కూడిన ధర్మాసనం విచారించింది. విద్యార్థుల తరపున న్యాయవాదులు ప్రశాంత్ భూషణ్, రమేశ్ అల్లంకిలు వాదనలు వినిపించారు. 2017నుంచి మెడికల్ పీజీ సీట్లు వందశాతం భర్తీ కావడం లేదన్నారు.గతేడాది ఒక్క తెలంగాణలోనే 172సీట్లు మిగిలిపోయాయని,దేశవ్యాప్తంగా సుమారు 10వేల డెంటల్ పిజి సీట్లు మిగిలిపోయాయని తెలిపారు. కౌన్సిలింగ్ అనంతరం ప్రభుత్వం కటాఫ్ మార్కులు తగ్గించడం, కోర్టులు పర్సంటైల్ తగ్గించడం ద్వారా భర్తీని కొంతమేర తగ్గిస్తున్నారని తెలిపారు.ఇప్పటికే ఎంబీబీఎస్ పూర్తి చేసినందున పీజీ కౌన్సిలింగ్కు అభ్యర్థులందరినీ ఆహ్వానించడం ద్వారా సమయం వృథా కాకుండా చూడొచ్చని తెలిపారు. ముందు వరసలో వారు ఎవరూ చేరకపోతే వెనక వారికి సీటు వచ్చే అవకాశం ఉందని కోర్టుకు వివరించారు. ఇప్పటికే విద్యార్థులు, పలు మెడికల్ అసోసియేషన్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసినట్టు తెలిపారు. అనంతరం ధర్మాసనం పది రోజులకు విచారణ వాయిదా వేస్తూ ఈ లోగా కేంద్రం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.