Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దయనీయంగా అభ్యర్ధిస్తున్న భారత విద్యార్ధులు
- వైరల్ అవుతున్న వీడియో
న్యూఢిల్లీ : ''మమ్మల్ని చంపేస్తారేమో మోడీ జీ....దయచేసి మాకు సాయం చేయండి.'' అంటూ ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్ధులు వేడుకుంటున్నారు. అక్కడ నెలకొన్న దయనీయ పరిస్థితులను వివరిస్తూ వారు మాట్లాడిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఉక్రెయిన్‌లోని ఈశాన్య ప్రాంత నగరమైన సుమీలో చిక్కుండిపోయిన కొంతమంది భారతీయ విద్యార్ధులు తమను అక్కడ నుండి తరలించే విషయంలో సాయం చేయాలంటూ ప్రధాని మోడీకీ విజ్ఞప్తి చేశారు. దాదాపు వందమంది విద్యార్ధులు ఉక్రెయిన్ పశ్చిమ సరిహద్దులకు వెళ్ళేందుకు సాయం కావాలంటూ వేడుకోవడం ఆ వీడియోలో కనిపిస్తోంది. వెంటనే మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి, లేకపోతే మమ్మల్ని కూడా చంపేస్తారేమో అని దయనీయంగా అభ్యర్ధిస్తుండడం కనిపిస్తోంది. ఆహారం లేదు, గత రాత్రి నుంచి తాగడానికి మంచినీళ్ళు లేవు, టాయిలెట్లలోకి నీళ్ళు రావడం లేదని విద్యార్ధులు తెలిపారు. పశ్చిమ ప్రాంత సరిహద్దుకు చేరుకుంటే అక్కడ నుంచి పొరుగుదేశాలకు చేరుకుని వారు స్వదేశం రావడానికి వీలు వుంటుంది. ఉక్రెయిన్‌లోని తూర్పు ప్రాంతంలో రష్యా దాడి చేసింది. దాంతో ఆ ప్రాంతాల్లో వున్న వేలాదిమంది భారత విద్యార్ధులు పశ్చిమ ప్రాంత సరిహద్దులకు చేరుకుని పోలాండ్, హంగరీ, ఇతర దేశాల్లోకి ప్రవేశిస్తున్నారు. ఈ సరిహద్దులకు చేరుకునేందుకు వారికి ఎలాంటి సాయం అందడం లేదు. కనిపించిన వాహనం పట్టుకుని, రిస్క్‌ను తట్టుకుని తమ స్వంతంగా రావడానికి ప్రయత్నిస్తున్నారు. ''మా కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదు. సుమీ నుండి కొంతమంది విదేశీ విద్యార్ధులు వారి స్వంతంగా వెళ్ళడం చూస్తున్నాం. కాని వారిపై కాల్పులు జరుగుతున్నాయి. అందుకు సంబంధించి మా వద్ద వీడియోలు కూడా వున్నాయి.'' అని భారతీయ విద్యార్ధి ఒకరు ఆ వీడియోలో పేర్కొన్నారు. ఆ విద్యార్ధి వెనుక ఆందోళనతో నిలుచున్న దాదాపు వందమంది విద్యార్ధులు కనిపిస్తున్నారు. ''ప్రభుత్వం సాయం చేస్తుందని మేం ఆశిస్తున్నాం. కానీ, దీనిపై మాకు ఎలాంటి సమాచారం అందడం లేదు. రష్యన్ సరిహద్దు వద్ద బస్సులు వేచి వున్నాయని కొంతమంది చెబుతున్నారు. ఆ ప్రాంతం ఇక్కడ నుండి 50కిలోమీటర్లు వుంటుంది. ఒకవేళ హాస్టల్ నుండి నడుచుకుంటూ వెళ్ళాలనుకున్నా నాలుగు వైపుల నుండి కాల్పులు జరుగుతున్నాయి, వైమానిక దాడులకు భయపడుతున్నాం. ప్రతి 20నిముషాలకోసారి బాంబు దాడులు జరుగుతున్నాయని'' ఆ విద్యార్ధి చెప్పారు. ఈ కేంపస్‌లో దాదాపు 900మంది విద్యార్ధులు వున్నారని తెలిపారు.
బుల్లెట్ గాయాలు.. ఆసుపత్రిలో కళ్లు తెరిచా : భారత విద్యార్థి హర్జోత్ సింగ్
ఉక్రెయిన్ నుంచి తప్పించుకునే క్రమంలో కాలికి తీవ్రగాయాలై... ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భారతీయ విద్యార్థి హర్జోత్ సింగ్ కోలుకున్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. తాను కళ్లు తెరిచే సరికి ఆసుపత్రిలో ఉన్నట్టు గుర్తించానని చెప్పారు. కుటుంబ సభ్యులను కలిసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
ఎల్వివ్ వెళ్లేందుకు కీవ్‌లో రైలు ఎక్కేందుకు వెళ్లగా.. తాను అనుమతించలేదని, దీంతో స్నేహితులతో కలిసి క్యాబ్ అద్దెకు తీసుకుని బయలు దేరామని చెప్పారు. కీవ్ నుండి బయటకు వెళుతుండగా.. క్యాబ్‌పై కాల్పులు జరిపారని, భుజం నుంచి బులెట్ దూసుకెళ్లిందని చెప్పారు. ఈ సమయంలో తన కాలు విరిగిందనీ, మోకాలితో బుల్లెట్ గాయాలయ్యాయని చెప్పారు. ఎల్వివ్‌కు వెళ్లేందుకు సౌకర్యాలు కల్పించాలని, తనను ఎవరూ సంప్రదించలేదని తెలిపారు. తాను ఎల్వివ్‌కు చేరుకునేలా సహకరించాలని రాయబార కార్యాలయాన్ని సంప్రదించగా.. తాను వివరాలు పదేపదే చెప్పాల్సి వచ్చిందనీ, తన పరిస్థితిని తెలియజేశానని అన్నారు. కానీ అటు నుండి ఎటువంటి సమాధానం తనకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన లాంటి వాళ్లు కీవ్‌లో చాలా మంది ఉన్నారని పేర్కొన్నారు.