Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢల్లీీ: ఉక్రెయిన్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు విడతల వారీగా స్వదేశానికి చేరుకుంటున్నారు. తాజాగా మరికొంత మంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన 145 మంది విద్యార్థులు ఉక్రెయిన్ నుంచి ఢిల్లీ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో తెలంగాణకు చెందిన 62 మంది విద్యార్థులు, ఆంధ్రప్రదేశ్ కు చెందిన 83 మంది ఢిల్లీకి శనివారం చేరుకున్నారు. అలాగే ఢిల్లీకి చేరుకున్న వారికి ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ (పిఆర్సి) ప్రవీణ్ ప్రకాశ్, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ ఆధ్వర్యంలో ఏపీ, తెలంగాణ భవన్ల ఉద్యోగులు వసతి, భోజన, రవాణా సదుపాయాలు, ఇతర సహాయ సహకారాలు అందించారు. ఇప్పటి వరకు తెలంగాణకు చెంది 450 మంది విద్యార్థులు స్వదేశానికి చేరుకున్నారని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. ఇంకా ఉక్రెయిన్లో 350 మంది తెలంగాణ విద్యార్థులు ఉండొచ్చని అన్నారు. మరోవైపు విద్యార్థుల తరలింపును వేగవంతం చేయాలని ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు జై శంకర్, జ్యోతిరాదిత్య సింధియా, హార్దిప్ సింగ్ పూరిలకు సీపీఐ(ఎం) ఎంపీ వి.శివదాసన్, టీడీపీ ఎంపి కె.రామ్మోహన్ నాయుడు లేఖలు రాశారు. సుమారు 507 మంది విద్యార్థులు రొమేనియా, హంగేరి సరిహద్దులు దాటి విమానాల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. రొమేనియా, హంగేరికి అదనపు విమానాలు పంపి విద్యార్థుల తరలింపు వేగవంతం చేయాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉక్రెయిన్ సరిహద్దుల్లోని విద్యార్థులు తీవ్ర భయాందోళనలో ఉన్నారని తెలిపారు.