Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంఫాల్ : మణిపూర్లో శనివారం జరిగిన రెండో దశ పోలింగ్లో రికార్డు స్థాయిలో 76.62 శాతం ఓట్లు పోలయ్యాయి. సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి చందేల్లో 76.71 శాతం ఓట్లు పోలవగా, జిరిభమ్లో 75.02, తుబాల్లో 78 శాతం ఓట్లు పోలయ్యాయని ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. పోలింగ్ సందర్భంగా చోటు చేసుకున్న వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు మరణించారు. తుబాల్ జిల్లాలో ఒకరు, సేనాపతి జిల్లాలో ఒకరు మృతి చెందారు. ఆరు జిల్లాల్లోని 22 నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో 92మంది అభ్యర్ధులు బరిలో వున్నారు. వీరిలో ఇద్దరు మహిళలు వున్నారు. మొత్తం 60నియోజకవర్గాలకు గానూ 38 స్థానాల్లో గత నెల 28న పోలింగ్ జరిగింది. సేనాపతి జిల్లాలోని పోలింగ్ స్టేషన్లో జరిగిన చిన్న ఘర్షణ కారణంగా పోలీసులు కాల్పులకు పాల్పడ్డారని, ఆ సంఘటనలో కె.లాంగ్వాయో అనే వ్యక్తి మరణించాడని గుర్తించినట్లు మీడియా వార్తలు తెలిపాయి. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. కరాంగ్ సీటు నుండి పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్ధి ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్కు తెలియచేశారు. అయితే దీనిపై జిల్లా ఎన్నికల అధికారి నుండి సమాచారం కోసం ఎదురుచూస్తున్నట్లు ఇసి అధికారులు తెలిపారు.