Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐఏడబ్ల్యూయూ జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్
న్యూఢిల్లీ : పాలకులే భూ కబ్జాలకు పాల్పడితే, ప్రజలు భూ స్వాధీన ఉద్యమాలకు సిద్ధపడటమే మార్గమని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ పిలుపు ఇచ్చారు. రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ ధిక్కారానికి పాల్పడుతున్నాయని, ప్రభుత్వ భూములను, ఆస్తులను కార్పొరేట్ శక్తులకు కట్ట పెడుతున్నాయని విమర్శించారు. ఈ నేపథ్యంలో రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల పైనే ఉందని అన్నారు. శనివారం కర్ణాటకలోని చంగోలిలో జరిగిన భూ సదస్సులో ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి భూమి సాగు చేసుకునే పేదలకు భూ పంపిణీ చేయడం ఒక ఒరవడిగా ఉందని, అయితే గత కొంత కాలంగా పాలకులు రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కుతున్నారని అన్నారు. కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం పేదల చేతుల్లో ఉన్న సాగు భూములను అభివృద్ధి, పారిశ్రామిక మండళ్లు పేరుతో పేదల వద్దనున్న భూమిని బలవంతంగా గుంజుకొంటుందని విమర్శించారు. 1970 దశకం నుండి భూసంస్కరణల చట్టాలు, పేదలకు భూ పంపిణీ అన్ని రాష్ట్రాల్లో కల్పించబడ్డా యన్నారు. దానికి విరుద్ధంగా ప్రస్తుత పాలకులు భూములు బలవంతంగా గుంజు కుంటున్నారని అన్నారు.. కేంద్రం పెట్టిన రూ. 40 లక్షల కోట్ల బడ్జెట్లో భూ పంపిణీ కోసం ఏమాత్రం కేటాయింపులు లేవని అన్నారు. ప్రాజెక్టులు, పరిశ్రమలు పేరుతో భూములు సేకరించే ప్రాంతాల్లో దళిత, ఆదివాసీలకు భూమి పంపిణీ చేయాలని చట్టాలు చెబుతున్నా ప్రభుత్వాలు దిక్కరిస్తున్నాయని ఆయన అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టేందుకు, చట్టాలను పరిరక్షించుకునేందుకు పేదలు పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. రిటైర్డ్ జడ్జి గోకలే మాస్టారు మాట్లాడుతూ ప్రభుత్వాలు చేసిన చట్టాలు, ఆ చట్టాల్లో ఉన్న స్ఫూర్తిని తన అనుభవాలతో సోదాహరణంగా వివరించారు. ఈ సదస్సులో ఏఐఏడబ్ల్యూయూ కర్నాటక రాష్ట్ర నాయకులు నిత్యానందస్వామి, చంద్రప్ప, ముని వెంకటప్ప తదితరులు పాల్గొన్నారు.