Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో రూపాయి విలువ అమాంతం పడిపోతుంది. ఇది వరకు ఎప్పుడూ లేని విధంగా డాలర్‌తో రూపాయి విలువ ఏకంగా 77కు పతనమైంది. రష్యా, ఉక్రెయిన్ ఆందోళన పరిణామాలకు తోడు కుప్పకూలుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు, తరలిపోతున్న విదేశీ సంస్థాగత నిధులు (ఎఫ్ఐఐ), పెరుగుతున్న వాణిజ్య లోటు, ద్రవ్యోల్బణ భయాలు రూపాయిని బక్కచిక్కేలా చేస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య సోమవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ ఏకంగా 84 పైసలు క్షీణించి ఏకంగా 77.01కి దిగజారింది. అమెరికన్ కరెన్సీతో పోల్చితే రూపాయి విలువ 76.85 వద్ద ప్రారంభమై ఓ దశలో రూ.77.17 కనిష్ట స్థాయిని తాకింది. ఇంతక్రితం శుక్రవారం సెషన్లోనూ 23 పైసలు నష్టపోయింది. వచ్చే కొన్ని రోజుల్లో రూపాయి విలువ మరింత పతనమయ్యే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అతి త్వరలోనే రూపాయి విలువ 77.50కు పడపోనుందని రెలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ కమోడిటీ అండ్ కరెన్సీ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ సుగంద సచ్దేవ్ అంచనా వేశారు. మధ్యస్థ కాలానికి డాలర్‌తో రూపాయి విలువ 79కి పతనమయ్యే అవకాశాలూ ఉన్నాయన్నారు. ఇదే జరిగితే దేశ వాణిజ్య లోటు అమాంతం పెరగనుంది. ద్రవ్యోల్బణం ఎగిసిపడనుంది.