Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బిజెపి గూండాల హింసాత్మక ఘటనలే కారణం
ఇంఫాల్ : మణిపూర్‌లోని ఉఖ్రూల్, సేనాపతి జిల్లాల్లోని 8 పోలింగ్ కేంద్రాల్లో మంగళవారం రీపోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఓటింగ్‌కు అనుమతిస్తారు. ఇవిఎంలు పనిచేయకపోవడంతోపాటు ఈ రెండూ జిల్లాల్లోనూ అధికార బిజెపి గూండాలు అనేక అక్రమాలకు పాల్పడ్డారని వెల్లడి కావడంతో ఈ రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. సేనాపతి జిల్లాలోని కరోంగ్ నియోజకవర్గంలో ఆదివారం ఇవిఎంలను ఎత్తుకుపోతుడటంతో భద్రతా సిబ్బంది జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిద్దరిని బిజెపి కార్యకర్తలుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన మాత్రమే కాకుండా అనేక ప్రాంతాల్లో అధికారి బిజెపి కార్యర్తలు ఆదివారం పోలింగ్ మందు రోజు నుంచి హింసాత్మాక ఘటనలకు, ప్రత్యర్థి అభ్యర్థి, ఓటర్లపై దాడులు, బెదిరింపులకు పాల్పడ్డారు.మరోవైపు, తౌబాల్ జిల్లాలోని వాంగ్జింగ్ టెన్థా అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఎం. హేమంత సోమవారం మాట్లాడుతూ తన నియోజకవర్గంలో కూడా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా రీపోలింగ్‌కు అధికారులు ఆదేశించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఆదివారం పోలింగ్‌లో అనేక అక్రమాలు జరిగాయని చెప్పారు. సీరియల్ నంబర్ ఆధారంగా ఓటింగ్ జరిగిందని, ముగ్గురు-నలుగురు వ్యక్తులే మొత్తం ఓట్లు వేశారని తెలిపారు. ఇందుకు సంబంధించిన పోలింగ్ కేంద్రాల వీడియో పుటేజీని అధికారులు కూడా వీక్షించారని చెప్పారు. పోలింగ్ కేంద్రంలోకి ఇతర పార్టీల అభ్యర్థులను బిజెపి గూండాలు అనుమతించలేదని, అలాగే ఇతర పార్టీల మద్దతు దారులను కూడా తమ ఓటు వేసుకోవడానికి అనుమతించలేదని హేమంత వివరించారు. బిజెపి గూండాలే అన్ని ఓట్లునూ వేసారని ఆరోపించారు.