Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఉక్రెయిన్‌పై రష్యా చేపడుతోన్న సైనిక చర్య 12వ రోజుకు చేరుకుంది. ఒకవైపు రష్యా దాడులు తీవ్రతరం చేస్తుండగా..మరోవైపు ఉక్రెయిన్ నుంచి ప్రతిఘటన ఎదురవుతోంది. ఈ సమయంలో ప్రధాని నరేంద్రమోడీ ఇరు దేశాల అధ్యక్షులకు ఫోన్ చేసి మాట్లాడారు. ఉదయం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మాట్లాడగా, అటు తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో 50 నిమిషాలపాటు ఫోన్లో సంభాషించారు. ఉక్రెయిన్‌లోని సుమీ ప్రాంతంలో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను సురక్షితంగా తరలించే విషయమై ప్రధానంగా చర్చించారు. అలాగే ప్రస్తుత సంక్షోభం గురించి వారు మాట్లాడుకున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితులు, ఇరు దేశాల బృందాల మధ్య జరుగుతోన్న చర్చల అంశం ఇరువురి మధ్య ప్రస్తావనకు వచ్చిందని తెలిసింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో నేరుగా మాట్లాడాలని ఈ సందర్భంగా పుతిన్‌ను ప్రధాని మోడీ కోరారు. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన ప్రజల్ని తరలించేందుకు రష్యా కాల్పుల్ని తాత్కాలికంగా విరమించిన సంగతి తెలిసిందే. అలాగే వారి తరలింపునకు సుమీతో సహా ఉక్రెయిన్‌లోని కొన్ని ప్రాంతాల్లో మానవతా కారిడార్లను ఏర్పాటుచేసింది. వీటిని ప్రస్తావించిన ప్రధాని మోడీ, పుతిన్‌ను అభినందించారు. పౌరుల తరలింపులో తమవంతు సహకారం అందిస్తామని పుతిన్..మోడీకి హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఉక్రెయిన్-రష్యా మధ్య మూడో విడత శాంతి చర్చలు మాస్కోలో జరగనున్నాయని వార్తలు వెలువడ్డాయి. ఇదిలా ఉండగా ఆదివారం ఉక్రెయిన్ నగరాల్లో మానవతావాద కారిడార్ల ఏర్పాటుకు సంబంధించి ఇరుదేశాల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఆయా నగరాల నుంచి పౌరుల తరలింపు బెలారస్, రష్యాకు తీసుకెళ్లటాన్ని ఉక్రెయిన్ తిరస్కరించింది.
సుమీలో అడ్డంకులు
సుమీ స్టేట్ యూనివర్సిటీ ప్రాంగణంలోని బంకర్లలో తలదాచుకున్న భారతీయ విద్యార్థుల కష్టాలు ఇంకా తీరలేదు. ఇక్కడ్నుంచీ విద్యార్థుల తరలింపు ఒక పెద్ద సమస్యగా మారింది. వాహనాల రాకపోకలకు అనేక అడ్డంకులు ఉన్నాయని, అందువల్లే తరలింపు ప్రక్రియ మరింత ఆలస్యమవుతోందని భారత విదేశాంగ శాఖ సోమవారం తెలిపింది. తీవ్రమైన చలి, ఆహార కొరత తమను బాధిస్తోందని భారతీయ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బంకర్ల నుంచి బయటకు వచ్చి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న రష్యా సరిహద్దుకు చేరుకుంటామని విద్యార్థులు శనివారం వీడియో సందేశాలు పంపారు. అయితే ఈ ఆలోచనను విరమించుకోవాలని భారత ప్రభుత్వం విద్యార్థుల్ని కోరింది.