Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఎంఎల్ఎ నిబంధనను సుప్రీంలో సమర్ధించుకున్న కేంద్రం
న్యూఢిల్లీ : అరెస్టు చేసే అధికారాలకు సంబంధించి మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఎ)లోని నిబంధనను కేంద్రం మంగళవారం సుప్రీంకోర్టులో సమర్ధించుకుంది. ఇందులో తగిన రక్షణలు కల్పించబడ్డాయని తెలిపింది. అరెస్టుకు గల కారణాలు, ఏ సాక్ష్యాధారాల ఆధారంగా అరెస్టు చేయాలని నిర్ధారణకు వచ్చారో వాటి సంబంధిత రికార్డులను పరిశీలనార్ధం సంబంధిత కోర్టు ముందుంచింది. సంబంధిత కోర్టుకు తెలియకుండా ఏదీ రహస్యంగా వుంచలేదని ప్రభుత్వం తెలిపింది. పిఎంఎల్ఎలోని కొన్ని నిబంధనలకు భాష్యం చెప్పడానికి సంబంధించి పలు పిటిషన్లపై సుప్రీం విచారణ జరుపుతోంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ) నుంచి పక్కకు మళ్లుతోందన్న కారణంగానే ఏ నిబంధనను రద్దు చేయలేమని కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు.
ఈ చట్టంలోని 19వ సెక్షన్లో ఎన్ని రక్షణలు కల్పించబడ్డాయో పరిశీలించాలని మెహతా కోర్టును కోరారు. వ్యక్తులను అరెస్టు చేయడానికి సంబంధించిన అంశాలను సెక్షన్ 19 విచారిస్తుంది. అత్యునుత స్థాయి అధికారులకు మాత్రమే అరెస్టు చేసే అధికారం వుంటుందని, అరెస్టయిన ప్రతి వ్యక్తిని 24గంటల్లోగా కోర్టు ముందు హాజరుపరచాల్సి వుంటుందని మెహతా చెప్పారు. 14, 21 అధికరణలను ఉల్లంఘించి ఏ దాడి జరపడానికి లేకుండా తగు రక్షణలు ఈ సెక్షన్లో కల్పించారని తెలిపారు.