Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : 'అమ్మ పేరు' కోసం ఓ కొడుకు చేసిన అలుపెరుగని పోరాటం వ్యవస్థలోని లొసుగులను బయటపెట్టింది. చట్టబద్దమైన గుర్తింపు పత్రాల్లో అమ్మ పేరు చేర్చడానికి అతడు ఏడేండ్లు పోరాడాడు. ఎట్టకేలకు విజయం సాధించాడు. అతడి పేరు సువామ్ సిన్హా. ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో లింగ్విస్టిక్ చదువుకుంటూ పనిచేస్తున్న 23 ఏండ్ల సువామ్ పోరాట పటిమను 'హిందూ' దినపత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. సువామ్ సిన్హా తల్లిదండ్రులు అతడికి రెండేండ్ల వయసున్నప్పుడు విడిపోయారు. అతని తండ్రి నేపాల్‌కు చెందినవాడు, తల్లి బీహార్‌లోని భాగల్పూర్ ప్రాంతవాసి. భారత పౌరుడిగా తనకు అర్హత ఉన్న తన ప్రాథమిక గుర్తింపు కార్డులన్నింటిలో చట్టబద్ధమైన సంరక్షురాలిగా తన తల్లి పేరును చేర్చేందుకు అతడు సుదీర్ఘ పోరాటం చేశాడు.
చాలా చర్చల తర్వాత సువామ్.. తన తల్లి మొదటి పేరుతో తొలిసారిగా స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్ పొందాడు. అయితే, 2015-2017 మధ్య కాలంలో ఆధార్ కార్డ్.. పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసినప్పుడు అడ్డంకులు తలెత్తాయి. ఫిబ్రవరి 11న పాన్‌కార్డు అందుకోవడంతో అతడి పోరాటం ముగిసింది. తాను కోరుకున్న విధంగా తన తండ్రి పేరు లేకుండా అన్ని గుర్తింపు కార్డులు పొందడానికి ఎన్ని అవమానాలు ఎదురైనా అతడు వెనుకడుగు వేయలేదు. సిన్హా తల్లి ప్రస్తుతం నేపాల్‌లోని ఖాట్మండులోని ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీలో కంట్రీ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.
'తండ్రి పేరు మాత్రమే గుర్తింపు కొలమానంగా ఎందుకు ఉండాలి. నా జీవితంలో మా నాన్న ఎప్పుడూ లేడు, అతనితో నాకు ఎలాంటి సంబంధం లేదు' అని సువామ్ సిన్హా అంటున్నారు. తన గుర్తింపు పత్రాలన్నిటిలోనూ తల్లి పేరే ఉండాలని కోరుకున్నాడు. తల్లితో కలిసి దరఖాస్తులు పట్టుకుని ఆయా కార్యాలయాలకు వెళ్లినప్పుడు ఎదురైన చేదు అనుభవాలు తట్టుకుని ముందుకు సాగాడు. అప్పటి కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, మేనకా గాంధీ నుంచి ఎంతో మంది ఉన్నతాధికారులకు మెయిల్ ద్వారా వినతులు పంపాడు. సింగిల్ పేరెంట్స్ అభ్యర్థనల మేరకు పాస్‌పోర్ట్ నియమాలను 2016 డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వం సవరించింది. పాస్‌పోర్ట్ దరఖాస్తులో చట్టపరమైన సంరక్షకులుగా తండ్రి లేదా తల్లి పేరు చేర్చేలా నిబంధనలను సవరించారు. అలాగే పాన్‌కార్డు నిబంధనలను కూడా ఆదాయపు పన్ను శాఖ 2018లో మార్చింది. అయితే ఆన్లైన్లో దీన్ని అప్డేట్ చేయలేదు. సువామ్ సిన్హా ఈ-దరఖాస్తు చేసిన ప్రతిసారి తండ్రి పేరు అడుగుతూనేవుంది. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ జోక్యంతో అతడు చివరికి దరఖాస్తు చేయగలిగాడు. పాన్‌కార్డుతో సహా అన్ని గుర్తింపుకార్డుల్లో తనకు చట్టబద్ద సంరక్షకురాలిగా తల్లి పేరును లిఖించి అమ్మకు ఎనలేని ఆనందాన్ని కలిగించిన సువామ్ సిన్హాను నెటిజన్లు మనసారా మెచ్చుకుంటున్నారు.