Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థులు విడతల వారీగా స్వదేశానికి చేరుకుంటున్నారు. ప్రత్యేక విమానాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు, తెలంగాణకు చెందిన 10 మంది మంగళవారం ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీకి చేరుకున్న తెలంగాణ విద్యార్థులకు తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ (పీఆర్సీ) ప్రవీణ్ ప్రకాశ్ ఆధ్వర్యంలో ఉచిత వసతి, భోజన, రవాణా సదుపాయాలు అందించారు. విద్యార్థులను స్వస్థలాలకు తరలించేందుకు తెలంగాణ, ఏపీ భవన్ అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు. ఇప్పటి వరకు ఉక్రెయిన్ నుంచి ఏపీకి చెందిన 691 మంది, తెలంగాణకు చెందిన 644 మంది విద్యార్థులు స్వదేశానికి చేరుకున్నారు. ఉక్రెయిన్ పొరుగు దేశాల నుంచి భారతీయ పౌరులను తరలించడానికి 'ఆపరేషన్ గంగా' కార్యక్రమంలో భాగంగా మంగళవారం 410 మంది భారతీయులు సుసెవా నుంచి రెండు ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి చేరుకున్నారు. దీనితో ఫిబ్రవరి 22న నుంచి ఇప్పటి వరకు ప్రత్యేక విమానాల్లో సుమారు 18 వేల మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. 75 ప్రత్యేక విమానాల్లో 15,521 మంది స్వదేశానికి చేరుకున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఎఎఫ్) 12 మిషన్ల ద్వారా 2,467 మంది ప్రయాణికులను తిరిగి తీసుకొచ్చింది. బుకారెస్ట్ నుంచి 21 విమానాల్లో 4,575 మంది ప్రయాణికులు, సూసీవ్ నుంచి 9 విమానాల్లో 1,820 మంది, బుడాపెస్ట్ నుంచి 28 విమానాల్లో 5,571 మంది, కోసిస్ నుంచి 5 విమానాల్లో 909 మంది, ర్జెస్జో నుంచి 11 విమానాల్లో 2,404 మంది, కైవ్ నుంచి ఒక విమానంలో 242 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు.