Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నారీశక్తికి సెల్యూట్ : మోడీ
న్యూఢిల్లీ : నారీశక్తి పురస్కారాన్ని ప్రొఫెసర్ సత్తుపాటి ప్రసన్న శ్రీ అందుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం నాడిక్కడ రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా నారీశక్తి పురస్కారాలు ప్రధానోత్సవం జరిగింది. వివిధ రంగాల్లో సేవలందించిన, కృషిచేసిన 29 మహిళలు పురస్కారాలను స్వీకరించారు. 2020 ఏడాదికిగాను 15 మందికి, 2021 ఏడాదికిగాను 14 మందికి నారీశక్తి పురస్కారాలు వరించాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రొఫెసర్ సత్తుపాటి ప్రసన్న శ్రీకి పురస్కారం వరించింది. ఆమె ఆంధ్రా విశ్వవిద్యాలయంలో బోర్డ్ ఆఫ్ స్టడీస్ ప్రొఫెసర్‌గానూ, చైర్‌పర్సన్‌గానూ వ్యవహరిస్తున్నారు. మైనారిటీ గిరిజన భాషలను సంరక్షించడానికి, గిరిజన భాషల కోసం కొత్త రచనా విధానాలను అభివృద్ధి చేయడానికి కృషిచేసిన భారతీయ భాషావేత్త. ఆమె కుపియా, కోయ, లింగువా పోర్జా, జటాపు, కొండదొర, గడబ, కోలం, గోండి, లింగువా కొటియా, సవర, కుర్రు, సుగాలి, లింగువా గౌడు, ముఖధోరా, రణ, భగత, కొలామి మొదలైన 19 గిరిజన భాషలకు లిపి (అక్షరాలను) రూపొందించిన ప్రపంచంలోనే మొదటి మహిళ. ఆమె సాహిత్య రచనలలో 'ఈస్ట్ అండ్ వెస్ట్ పోస్ట్ మాడర్న్ లిటరేచర్‌లో మహిళల సైకోడైనమిక్స్', 'షేడ్స్ ఆఫ్ సైలెన్స్', 'ఉమెన్ ఇన్ శశి దేశ్‌పాండే నవల - ఎ స్టడీ వంటి రచనలు ఉన్నాయి. ఆమె 2019లో అమెరికాలో అంతరించిపోతున్న వరల్డ్ అట్లాస్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ప్రదర్శించబడిన మొదటి భారతీయ, ఆసియా మహిళ. మైనారిటీ గిరిజన భాషలను పరిరక్షించడం కోసం ఆమె చేసిన విశేష కృషికి నారీ శక్తి పురస్కారం లభించింది. ఆమె తన కెరియర్లో ఎక్కువ సమయం ఆయా భాషల సంరక్షణకే ప్రాధాన్యం ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. వారి భద్రత, గౌరవాన్ని నిర్ధారించడానికి ప్రతి ఒక్కరికి వారి కలలు, ఆకాంక్షలను కొనసాగించడానికి అవకాశాలు అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమంలో కేంద్ర మహిళ, శిశుసంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ తదితరులు పాల్గొన్నారు.
నారీశక్తికి సెల్యూట్ : మోడీ
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలకు సెల్యూట్ చేస్తున్నామనీ, వివిధ పథకాల ద్వారా మహిళా సాధికారతపై తమ ప్రభుత్వం దృష్టి సారిస్తూనే ఉంటుందని అన్నారు. మహిళలకు గౌరవం, అవకాశాల కల్పనకు చేస్తున్న కృషి కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. భారతదేశ అభివద్ధి ప్రయాణంలో మహిళలను ముందు వరుసలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. ''ఆర్థిక స్వావలంబన నుంచి సామాజిక భద్రత వరకు, నాణ్యమైన హెల్త్‌కేర్ నుంచి హౌసింగ్ వరకూ, విద్య నుంచి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేంత వరకూ మన నారీశక్తిని భారత అభివృద్ధి యాత్రలో అగ్రభాగాన నిలిపేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా మరింత పట్టుదలతో ఈ ప్రయత్నాలను ముందుకు తీసుకు వెళ్తాం'' అని మోడీ పేర్కొన్నారు.