Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.25కోట్లు జరిమానా విధించిన ఎన్జీటీ
న్యూఢిల్లీ : నిబంధనల్ని తీవ్రంగా ఉల్లంఘిస్తున్నాయని భారత్‌లోని కోకాకోలా, పెప్సీకోలపై జాతీయ గ్రీన్ ట్రిబ్యూనల్ (ఎన్జీటీ) కొరఢా జులిపించింది. ఆ కంపెనీలకు సంబంధించిన మూన్ బేవరేజెస్, వరుణ్ బేవరేజెస్లకు రూ.25కోట్ల జరిమానా విధించింది. ఇష్టారీతిగా భూగర్భ జలాలు తోడేయటం, లైసెన్స్‌ను పొందటంలో ఆయా సంస్థలు అక్రమాలకు పాల్పడ్డాయని ఎన్జీటీ తేల్చింది. ఉత్తరప్రదేశ్‌లోని కోకాకోలా, పెప్సీలకు తయారీ యూనిట్లు ఉన్నాయి. తయారీ యూనిట్ల వద్ద భూగర్భ జలాల్ని వాడుకోవటంపై కంపెనీలకు ఇచ్చిన ఎన్ఓసీ గడువు ముగిసిన తర్వాత కూడా మూన్ బేవరేజెస్, వరుణ్ బేవరేజెస్లు భూగర్భ జలాల్ని ఉపయోగించిందని ఎన్జీటీ విచారణలో తేలింది. ఈనేపథ్యంలో ఎన్జీటీ ఛైర్పర్సన్ ఆదర్శ్ కుమార్ గోయల్ నేతృత్వంలోని ప్యానెల్ కోకాకోలా,పెప్సీలకు చెందిన పలు ప్లాంట్లపై రూ.25కోట్ల జరిమానా విధించింది.కంపెనీలు నిర్వహిస్తున్న ప్లాంట్ల వద్ద భూగర్భ జలాలు నిర్దేశిత స్థాయికి వచ్చేంత వరకూ అక్కడ నీటిని ఉపయోగించరాదని ఆదేశించింది. తమ ఆదేశాలు సరిగా అమలు అవుతున్నాయా? లేదా? అన్నది పరిశీలించాలని కేంద్ర అడవులు, పర్యావరణ శాఖ, జల్‌శక్తి, కాలుష్య నియంత్రణ బోర్డ్, గ్రౌండ్ వాటర్ ట్రిబ్యూనల్, యూపీ నీటి శాఖ అధికారుల్ని కోరింది. నిబంధనలు కచ్చితంగా అమలు జరిగేలా చూడాలని తెలిపింది.