Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అకాల వర్షాలతో పంటలకు నష్టం
- భారత్‌లో ఐదో వంతుకు తగ్గిన ఉత్పత్తి
- నాలుగు నెలల్లో రికార్డు స్థాయిలో
- 80 శాతం పెరిగిన ధరలు
న్యూఢిల్లీ : భారత్‌లో ఎర్ర మిర్చి ధరలు కొండెక్కుతున్నాయి. అగ్ర ఎగుమతిదారుగా ఉన్న భారత్‌లో ఏడాది క్రితం నుంచి ఉత్పత్తి ఐదో వంతుకు పడిపోయింది. కీటకాల దాడి, కీలకమైన దక్షిణాది ఉత్పాదక రాష్ట్రాల్లో అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. దీంతో ఎర్ర మిరపకాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దేశంలో తక్కువ ఉత్పత్తి కారణంగా నాలుగు నెలల్లో రికార్డు స్థాయిలో ధరలు 80 శాతం పెరిగాయి. ఫలితంగా ఈ ఏడాది పొడవునా ధరలు ఎక్కువగానే ఉండే అవకాశం కనిపిస్తున్నదని మార్కెట్ వ్యాపారులు తెలిపారు. ఒకపక్క ప్రపంచవ్యాప్తంగా ఇంధనం, ఇతర ఆహార పదార్థాల ధరలు పెరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో విదేశీ కొనుగోలుదారులు ఎర్ర మిర్చిపై మరింత ఎక్కువ ఖర్చు పెట్టవలసి వస్తున్నదని మార్కెట్ వర్గాలు తెలిపాయి. '' తెగుళ్ల దాడి అధికంగా ఉన్నది. చాలా ప్రాంతాల్లో పుష్పించే దశలో రైతులు మొక్కలను నిర్మూలించాల్సి ఉన్నది. ఫలితంగా 20 శాతం దిగుబడి తగ్గుతుందని రైతులు భయపడుతున్నారని ఆయన తెలిపారు.
భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎర్ర మిర్చి ఎగుమతిదారు. 2021లో భారత్ 5.78 లక్షల టన్నుల ఎర్ర మిర్చిని ఉత్పత్తి రవాణా చేసింది. ఇది ఏడాది క్రితంతో పోలిస్తే దాదాపు 8 శాతం పెరిగింది. బంగ్లాదేశ్, చైనా, ఇండోనేషియా, మలేషియా, నేపాల్, శ్రీలంక, థారులాండ్, యూఎస్‌లు 2021లో భారత ఎగుమతులలో 130 కోట్ల డాలర్లతో ఎక్కువ వాటాను కలిగి ఉన్నాయి. పురుగు మందులు ఎక్కువగా వాడినప్పటికీ రెండెకరాల్లో వేసిన మిరప పంటకు తెగులు వ్యాప్తి చెందిందని ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన రైతు మహంకాల్ రావు చెప్పారు. భారత్‌లోని అతిపెద్ద స్పాట్ మార్కెట్ అయిన గుంటూరులో టోకు ధరలు నవంబర్‌లో క్వింటాల్‌కు దాదాపు రూ. 10వేల నుంచి రూ. 18 వేలకు పెరిగాయి. సరఫరాల గురించి ఆందోళన చెందుతున్న భారతీయ మసాలా దినుసుల కంపెనీలు గత కొన్ని నెలలుగా దూకుడుగా కొనుగోళ్లు చేస్తున్నాయనీ, ఇది కూడా ధరల పెరుగుదలకు కారణమైందని ఎగుమతిదారుడు ఏ.పీ.జే అరుణ్ తెలిపారు. ఇక తెలంగాణ, ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో మిర్చికి తామర తెగులు విస్తరించటం వల్ల రైతులు తీవ్ర ఆందోళనవ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయశాఖ అధికారులు కొత్త తెగుళ్ల గురించి అవగాహన కల్పించటంతో పాటు, పంట నష్టపోతున్న రైతుల్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని రైతుసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.