Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హంగ్ సంకేతాలు బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్
పనాజీ : ఎగ్జిట్ పోల్స్ ఫలితాల నేపథ్యంలో గోవాలో రాజకీయం వేడెక్కింది. కాంగ్రెస్, బీజేపీలు తమ అభ్యర్థులను కాపాడుకునే ప్రయత్నాలు వేగవంతం చేశాయి. ఉత్తర, దక్షిణ గోవా ప్రాంతాల్లో ఉన్న హోటల్స్‌కు కాంగ్రెస్ తమ అభ్యర్థుల్ని తరలించిందని సమాచారం. గత ఎన్నికల్లో 17 సీట్లు తెచ్చుకున్నప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయిన కాంగ్రెస్, ఈసారి ఫలితాలు వెలువడకముందే మొత్తం 37 మంది అభ్యర్థులను రెండు హోటల్స్‌కు మార్చింది. కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం, ఏఐసీసీ గోవా ఇన్చార్జి దినేష్ గుండూరావు, ప్రతిపక్ష నాయకుడు దిగంబర్ కామత్, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు గిరీష్ చోడంకర్ పనాజీలో పహారా కాస్తున్నారు. సోమవారం సాయంత్రం సీఎం ప్రమోద్ సావంత్‌ను బీజేపీ హైకమాండ్ హఠాత్తుగా ఢిల్లీకి పిలిపించింది. ప్రధాని మోడీని కూడా కలిశారు. ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థి అమిత్ పాలేకర్ మాట్లాడుతూ రెండు మూడు రోజులుగా బీజేపీ గాలం వేస్తున్నదని తెలిపారు. ఎంజీపీతో పొత్తు పెట్టుకుంటామని చెబుతున్నారు. ఎన్నికలకు ముందు 22 సీట్లు తెస్తామని చెప్పి..హంగ్ అనగానే ఇపుడు బీజేపీ అడ్డదారులు వెతుకుతోందని ఆరోపించారు. ఆప్ తరఫున బరిలో నిలిచిన మా అభ్యర్థులందరినీ కలిశామనీ, ఒకరిపై మరోకరికి పూర్తి నమ్మకం ఉన్నది. అందవల్ల ఏ హోటల్‌కు వెళ్లడం లేదని పాలేకర్ చెప్పారు.తనతో సహా ముగ్గురు అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో పొత్తు పెట్టుకోమని గోవా ఫార్వర్డ్ పార్టీ చీఫ్ విజరు సర్దేశారు చెప్పారు. మా అభ్యర్థులపై నాకు పూర్తి నమ్మకం ఉంది, అందువల్ల రిసార్ట్ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదన్నారు.
ఇండిపెండెంట్లతో బీజేపీ సంప్రదింపులు...
ఎన్నికల్లో విజయం సాధించగల స్వతంత్ర అభ్యర్థులతో బీజేపీ ప్రస్తుతం టచ్‌లో ఉంది. అవసరమైతే ముందుగా స్వతంత్ర అభ్యర్థులతో ఒప్పందం చేసుకుంటారు. గోవా సీనియర్ జర్నలిస్ట్ కిషోర్ నాయక్ గాంకర్ ప్రకారం, మాజీ సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్, ఉత్పల్ పారికర్ సహా మరో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందగలరు. వారిని పార్టీలో చేర్చుకుని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ఆ తర్వాత మంత్రి పదవులు కూడా ఇచ్చే అవకాశాలున్నాయని చర్చ నడుస్తోంది. అయితే ఇప్పటికే చాలా చోట్ల ఎన్నికల సమయంలో అప్రకటిత పొత్తు ఏర్పడింది. అంటే, పార్టీ బలహీనంగా ఉన్న చోట, అది తెరవెనుక ఉన్న స్వతంత్ర ఎమ్మెల్యేను సంప్రదించినట్టు సమాచారం. బీజేపీలో చేరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సహాయం చేసేలా ముందస్తుగా రహస్యభేటీలు కూడా జరిగినట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఢిల్లీలోనే గోవా సీఎం సావంత్ మకాం..
గోవా సీఎం ప్రమోద్ సావంత్ సోమవారం నుంచి ఢిల్లీలోనే మకాం వేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆయన అగ్రనాయకత్వంతో చర్చలు జరిపినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ బుధవారం గోవా చేరుకోవచ్చని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. 2017లో బీజేపీ కేవలం 13 సీట్లు మాత్రమే తెచ్చుకోగలిగింది, కానీ అమిత్ షా , నితిన్ గడ్కరీలు పనాజీకి చేరుకుని రాత్రికి రాత్రే గోవాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మళ్లీ అడ్డదారిలో అధికారం దక్కుంచుకునేవిధంగా బీజేపీ తాపత్రాయపడుతోంది.