Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.వేలకోట్ల విలువజేసే సంస్థ ' సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్'..
- రూ.210కోట్లకు అమ్మేసిన మోడీ సర్కార్!
- కొనుగోలుదార్ల వెనుక యూపీ బీజేపీ నాయకులు
- అమ్మకం ప్రక్రియ ఆపేయాలని సీపీఐ(ఎం), కాంగ్రెస్ డిమాండ్
న్యూఢిల్లీ : దేశ ప్రజల ఆస్తి, వేలకోట్ల రూపాయల విలువజేసే ప్రభుత్వరంగ సంస్థల్ని మోడీ సర్కార్ పప్పుబెల్లాలకు అమ్మేస్తోంది. ప్రభుత్వరంగ సంస్థల అమ్మకంపై ఇష్టానుసారంగా వ్యవహరిస్తోంది. లాభాల్లో నడుస్తున్న సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (సీఈఎల్)ను ఉత్తర ప్రదేశ్‌కు చెందిన బీజేపీ నాయకులు హస్తగతం చేసుకునేందుకు ఎత్తుగడలు వేశారు. వారి కోసం మోడీ సర్కార్ సంస్థ విలువను రూ.210కోట్లకు లెక్కగట్టి..అమ్మేయాలని నిర్ణయించింది. అయితే అమ్మకం ప్రక్రియలో అవకతవకలు బయటపడటంతో..రాజకీయంగా ఈ అంశం చర్చనీయాంశమైంది. సీఈఎల్ టెండర్ ప్రక్రియపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వెలువడ్డాయి. దాంతో అమ్మకం ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని కేంద్రం ప్రకటించింది. సీఈఎల్ అమ్మకాన్ని కాంగ్రెస్, సీపీఐ(ఎం) తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఒక వ్యూహం ప్రకారం సీఈఎల్ విలువను కేంద్రం తక్కువ చేసిందని, దీని కొనుగోలు వ్యవహారంలో ఉత్తర ప్రదేశ్ బీజేపీ నాయకులు ఉన్నారని, ఆగ్రా మేయర్ నవీన్ జైన్‌కు అత్యంత సన్నిహితులైన వ్యక్తులే సీఈఎల్‌ను కొనుగోలు చేశారని న్యూస్ వెబ్ పోర్టల్ 'ద వైర్'లో వార్తా కథనం వెలువడింది. టెండర్లో అక్రమాలు జరిగాయని ఢిల్లీ హైకోర్ట్, లోక్‌పాల్‌లో పలు పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. వేలకోట్ల రూపాయల 'వర్క్ ఆర్డర్' సీఈఎల్ చేతిలో ఉంది. ఢిల్లీ శివారు ప్రాంతంలో సుమారుగా రూ.700కోట్ల విలువజేసే 50 ఎకరాల భూమి ఉంది. వాస్తవానికి సంస్థను అమ్మాల్సిన అవసరం కూడా లేదు. ప్రస్తుతం సంస్థ చేతిలో రూ.1592కోట్ల విలువజేసే ఆర్డర్లు ఉన్నాయి. సంస్థకు ఉన్న ప్రధానమైన అప్పు కేవలం రూ.1.88కోట్లు. ఇలాంటి సంస్థకు మోడీ సర్కార్ కేవలం రూ.210కోట్లు విలువగట్టడం..పలు అనుమానాలకు తావిచ్చింది. కొద్ది రోజుల క్రితం జరిగిన అమ్మకపు ప్రక్రియలో ఢిల్లీకి చెందిన 'నందాల్ ఫైనాన్స్, లీజింగ్' అనే కంపెనీ సీఈఎల్‌ను కైవసం చేసుకుంది.
ఊరు పేరులేని సంస్థ కాదు..
కేంద్రం సీఈఎల్‌ను 1974లో స్థాపించింది. ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీలో ప్రఖ్యాత సంస్థగా పేరొందింది. ప్రభుత్వ పరిశోధనా సంస్థలు, ఆర్ అండ్ డీ సంస్థలు అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని సీఈఎల్ పలు ఉత్పత్తులు చేపడుతోంది. ఉదాహరణకు ఆకాశ్ మిస్సైల్ వ్యవస్థలో కంట్రోల్ మోడల్స్, వెపన్ లొకేటింగ్ రాడార్లను ఈ సంస్థే తయారుచేసింది. సంస్థకు 5మెగా వాట్ల సామర్థ్యం ఉన్న విద్యుత్ ప్లాంట్ కూడా ఉంది. రక్షణశాఖ, రైల్వే, భద్రత, నిఘా, పునరుత్పాదక శక్తి, దేశ భద్రత..మొదలైన అంశాల్లో అత్యంత కీలకమైన ఉత్పత్తుల్ని సీఈఎల్ అందిస్తుంది. పలు ప్రభుత్వ విభాగాల్లో నాలెడ్జ్ సేవల్ని అందిస్తోంది. లాభాల్లో ఉన్న ఈ సంస్థను అమ్మేయాలని 2016లో మోడీ సర్కార్ నిర్ణయించటం సంచలనం సృష్టించింది. సంస్థలో 100శాతం ప్రభుత్వ వాటాను కేవలం రూ.194కోట్లకు అమ్మడానికి సిద్ధమైంది. మూడు నెలల క్రితం చేపట్టిన టెండర్ ప్రక్రియలో నందాల్ ఫైనాన్స్, లీజింగ్, జీపీఎం ఇండిస్టీస్ అనే రెండు సంస్థలు పాల్గొనగా, రూ.210కోట్లు కోట్ చేసిన 'నందాల్ ఫైనాన్స్, లీజింగ్'కు సీఈఎల్‌ను అప్పజెప్పటానికి రంగం సిద్ధమైంది. కేంద్రం ఉద్దేశపూర్వకంగా సంస్థ విలువను తగ్గించిందని ఆరోపణలు వెలువడ్డాయి. 'నందాల్ ఫైనాన్సింగ్, లీజింగ్' కంపెనీతో ఉత్తరప్రదేశ్ బీజేపీ నాయకులకు సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. సీఈఎల్ అమ్మకం ప్రక్రియను సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టు, లోక్‌పాల్‌లో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ఈ వ్యవహారం కాస్తా రాజకీయంగా తీవ్ర దుమారం రేపటంతో మోడీ సర్కార్ దిద్దుబాటు చర్యలకు దిగింది. అమ్మకం ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేస్తున్నామని, వేలంపాటలో పాల్గొన్న బిడ్డర్స్, వారిపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరుపుతామని కేంద్రం ప్రకటించింది.