Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీకి యూరోపియన్ ఎంపీల లేఖ
న్యూఢిల్లీ : భారత్‌లో మానవ హక్కుల కార్యకర్తల పట్ల ప్రవర్తిస్తున్న తీరుపై యూరోపియన్ పార్లమెంట్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తూ.. ప్రధాని మోడీ, ఇతర ఉన్నతాధికారులకు లేఖ రాశారు. శాంతియుతంగా పనిచేసుకుంటున్న సామాజిక కార్యకర్తలను ఉగ్రవాదులుగా ముద్రవేసి, ఉగ్రవాద నిరోధక చట్టాన్ని లక్ష్యంగా చేసుకుని వారిని జైలు పాలు చేస్తున్నారనీ, వారు విపరీతమైన ఆంక్షలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మూడు కేసులను ఎత్తి చూపారు. ఎల్గార్ పరిషత్ కేసులో 16 మంది కార్యకర్తలు, విద్యావేత్తల అరెస్టు, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టినందుకు కార్యకర్తలు, విద్యార్థులను అరెస్టు చేస్తూనే ఉండటం, కాశ్మీర్ సామాజిక కార్యకర్త ఖుర్రం పర్వేజ్‌ను అదుపులోకి తీసుకోవడాన్ని ప్రస్తావించారు. అసమ్మతిని అణగదొక్కేందుకు చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (ఉపా) ఓ విధానంలో వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. దీన్ని సిట్టింగ్, పదవీ విమరణ పొందిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సైతం ఖండించారని గుర్తు చేశారు. ఎల్గార్ పరిషత్ కేసులో నిందితుల్లో కొందరిని లక్ష్యంగా చేసుకోవడానికి పెగాసెస్ స్పైవేర్, నెట్వైర్లను వినియోగించినట్లు వచ్చిన నివేదికలపై సూచిస్తూ.. అక్రమ స్పైవేర్, నిందితుల కంప్యూటర్లో డిజిటల్ సాక్ష్యాలను ఏర్పాటు చేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు యూరోపియన్ సభ్యులు లేఖలో పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా నిర్భంధించిన వారిని తక్షణమే, భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.