Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అత్యంత వేగంగా అనుమతులు
- ఇష్యూ తేదిపై కేంద్రానిదే తుది నిర్ణయం
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసి ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ) ప్రతిపాదనకు మార్కెట్ రెగ్యూలేటరీ సెబీ బుధవారం ఆమోదం తెలిపింది. దేశంలోనే ఈ అతిపెద్ద బీమా సంస్థలో 5 శాతం వాటాలను విక్రయించాలని మోడీ సర్కార్ నిర్ణయించింది. ఇందుకు సమానమైన 31.6 కోట్లకు పైగా ఈక్విటీ షేర్లను అమ్మకానికి పెడుతోంది. ఆఫర్ ఫర్ సేల్ (ఒఎఫ్ఎస్) ద్వారా ఈ వాటాల ఉపసంహరణతో రూ.60,000 నుంచి రూ.75,000 కోట్లు నిధులను తన ఖజానాలో వేసుకోవాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఒకసారి సెబీ అనుమతి లభించిన తర్వాత ఐపిఒకు ఎప్పుడు వెళ్లాలనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించాల్సి ఉంది. సాధారణంగా ఏదైనా ఒక కంపెనీ ఐపిఒకు దరఖాస్తు చేసుకుంటే సెబీ 30-40 రోజుల సమయం తీసుకుని నిర్ణయం వెల్లడిస్తుంది. కానీ.. ఎల్ఐసికి మాత్రం 22 రోజుల్లోనే అనుమతులు జారీ చేయడం విశేషం. ఈ ఏడాది ఫిబ్రవరి 12న ఎల్ఐసి తన ఐపిఒ దస్త్రాలను సెబీకి సమర్పించింది. ఐపిఒలో 5 శాతం వాటాల విక్రయం తర్వాత ప్రభుత్వానికి 95 శాతం వాటాలు ఉండనున్నాయి. ఎల్ఐసి విలువను రూ.12-15 లక్షల కోట్లుగా అంచనా వేసినట్లు సమాచారం. ఎల్ఐసికి 25 కోట్ల పాలసీదారులు ఉన్నారు. ఐపిఒలో వాటాలను కొనుగోలుచేయడానికి దాదాపు 90 లక్షల మంది వరకు తమ పాన్ కార్డును పాలసీలతో అనుసంధానం చేసుకున్నారని అంచనా. ఈ ఇష్యూలో పాలసీదారులకు రిజర్వేషన్ కల్పిస్తున్న నేపథ్యంలో అనేక మంది ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు.