Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఓట్ల లెక్కింపునకు ముందు వీవీప్యాట్ స్లిప్‌ల వెరిఫికేషన్ చేసేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్ విచారణను దేశ సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. వీవీప్యాట్ ధృవీకరణ కోసం యాధృచ్చికంగా ఎంపిక చేసిన బూత్‌ల సంఖ్యను ఐదు నుంచి 25కి పెంచాలని కూడా ఈ పిటిషన్ కోరింది. అయితే, 2019లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ సంఖ్య ఐదుగానే ఉన్నది. వీవీప్యాట్ వెరిఫికేషన్‌పై 2019 ఆర్డర్‌ను ఎన్నికల సంఘం ఫాలో అవుతోందని ఎన్నికల సంఘం తరఫున సీనియర్ అడ్వకేటు మనిందర్ సింగ్ కోర్టుకు తెలిపారు. దాని ప్రకారమే ఎన్నికల అధికారులు శిక్షణ పొందారని వివరించారు. గోవా, మణిపూర్, యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్ లలో కౌంటింగ్ టీమ్‌లను ఇప్పటికే కేటాయించునందున మార్పులకు ఆస్కారం లేదని తెలిపారు. దీంతో పిటిషన్‌పై విచారణను ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, న్యాయమూర్తులు జస్టిస్ ఏ.ఎస్ బోపన్న, హిమ కోహ్లి లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. నేడు (గురువారం) ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరిగి ఫలితాలు వెలువడనున్న తరుణంలో సుప్రీంకోర్టు ఈ పిటిషన్ విచారణను తిరస్కరించడం గమనార్హం.
ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత అభ్యర్థికి సంబంధించిన పేరు, సీరియల్ నెంబర్, పార్టీ గుర్తుతో కూడిన పేపర్ ప్రింట్‌ను వీవీప్యాట్ మెషన్ ఇస్తుంది. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలకు తావు లేకుండా.. తాము ఎంచుకున్న అభ్యర్థికే ఓటు వేశామా? లేదా? అన్నది సాధారణ ఓటరుకు అర్థమవడానికి ఈ వీవీప్యాట్ పేపర్ స్లిప్‌లు ఏడు సెకండ్ల పాటు కనిపిస్తాయి. అనంతరం ఆ పేపర్ స్లిప్ లాక్డ్ కంపార్ట్మెంట్లోకి వెళ్తుంది. దీనిని కేవలం పోలింగ్ ఏజెంట్ యాక్సెస్ చేయగలడు.