Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధిక ధరలతో ఒత్తిడి
- భారత వృద్థి రేటు బలహీనం : రాజన్
ముంబయి : భారత వృద్థి రేటు బలహీనంగా ఉందని ఆర్బిఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. దేశంలో ధరలు పెరిగిపోతున్నాయని ఓ ఇంటర్యూలో రాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితిని దేశం పున సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వైద్య విద్య కోసం భారత విద్యార్థులు ఉక్రెయిన్ సహా విదేశాలకు వెళ్లాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. ఇక్కడి అధిక ఫీజులే కారణమని పరోక్షంగా పేర్కొన్నారు. విద్యార్థులు ఉన్నత విద్య కోసం దేశాన్ని విడిచి పెట్టాల్సిన అవసరం ఎందుకు వస్తోందని.. మేథో సంపత్తిని ఎందుకు బయటి దేశాలకు వెళ్లేలా చేస్తున్నామన్నారు. ఈ మేథో మూలధనాన్ని మనం నిలుపుకోలేమా.? అని రాజన్ ప్రశ్నించారు. ఆరేళ్ల క్రితం మోడీ సర్కార్ పెద్ద నోట్లను రద్దు చేయడంతో దేశ ఆర్థికాభివృద్థికి గండిపడిందన్నారు. 2016 నోట్ల రద్దు ప్రక్రియ తర్వాత ఆర్థికాభివద్ధి ఎన్నడూ పటిష్ఠంగా కోలుకోలేదన్నారు. అధిక ద్రవ్యలోటు, కరెంటు ఖాతా లోటు, ద్రవ్యోల్బణం అంశాలు భారత్‌ను వేధిస్తున్న ప్రధాన సమస్యలన్నారు. రష్యా-ఉక్రెయిన్ ఆందోళనల నేపథ్యంలో వీటిని అదుపు చేయడానికి జాగ్రత్తగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఆ రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా గ్లోబల్ సరఫరా గొలుసులో అంతరాయం ఏర్పడిందన్నారు. ఇది భారత్‌లో ధరలపై ప్రభావం చూపుతోందన్నారు. అధిక ద్రవ్యోల్భణంతో ఆర్బీఐకి లేదా ప్రభుత్వానికి నష్టమేనన్నారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ధరలను కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు.