Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎరువుల సంక్షోభం ఉన్నా... ఒప్పుకోని కేంద్రం
- రైతుల కష్టాలకు మోడీ సర్కారుదే బాధ్యత : విశ్లేషకులు
న్యూఢిల్లీ : దేశంలో ఎరువుల లభ్యత, వాటి ధరల పెరుగుదల రైతులను ఇబ్బందుల పాల్జేస్తున్నది. కేంద్రం నిర్లక్ష్యం కారణంగా దేశంలో తీవ్ర ఎరువుల కొరత ఏర్పడింది. ధరలు కూడా గతంలో ఎన్నడూ లేనంతగా ఆకాశాన్నంటాయి. వీటిని నియంత్రించడంలో మోడీ సర్కారు చాలా విఫలమైంది. దీంతో దేశంలో ఎరువుల సంక్షోభం ఏర్పడింది. ఫలితంగా రైతులు ఈ విషయంలో నానా నరకయాతనను అనుభవించారు. కానీ, మోడీ ప్రభుత్వం మాత్రం దీనిని తోసిపుచ్చుతున్నది. దేశంలో ఎరువుల సంక్షోభం పరిస్థితిని ఒప్పుకోవడానికి నిరాకరిస్తున్నది.
ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం రాయితీలు పెంచినా తక్షణ పరిష్కారం మాత్రం లభించలేదు. కొనసాగుతున్న సంక్షోభానికి నిర్మాణాత్మక కారణాలను ఎదుర్కోవడానికి ఎటువంటి తీవ్రమైన చర్యలు తీసుకోలేదు. ఎరువులు వ్యవసాయానికి కీలకమైనదనీ, సరఫరాలో కొరత జాతీయ ఆహార భద్రతను గణనీయంగా దెబ్బతీస్తుందని విశ్లేషకులు తెలిపారు. అయితే, ప్రస్తుత సంక్షోభానికి మోడీ సర్కారు అవలంభించిన తప్పుడు విధానాలేనని వివరించారు. ఇవి ప్రభుత్వ రంగ నేతృత్వంలోని దేశీయ ఎరువుల ఉత్పత్తిని బలహీనపర్చాయన్నారు. ప్రయివేటు రంగం ద్వారా దిగుమతులు, ఉత్పత్తిపై ఆధారపడటాన్ని పెంచాయని తెలిపారు.
ఇటు అంతర్జాతీయంగానూ ఎరువుల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ తరుణంలో ముందు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన కేంద్రం దానిని విస్మరించింది. రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన తాజా సమాచారం ప్రకారం.. ఒక ఏడాదిలో (నవంబర్ 2020-నవంబర్ 2021) మెట్రిక్ టన్ను (ఎంటీ) యూరియా ధర 230 శాతం పెరిగింది. అలాగే, డై అమ్మోనియం ఫాస్ఫేట్ (డీఏపీ) 120 శాతం, అమ్మోనియా 224 శాతం, మ్యూరియేట్ ఆఫ్ పొటాష్ (ఎంఓపీ) 22 శాతం ధరలు పెరిగాయి. గతేడాది అక్టోబర్-నవంబర్ మధ్య యూరియా ధరలు దాదాపు 25 శాతం, డీఏపీ 15 శాతం పైకి ఎగబాకడం గమనార్హం.
ఇదిలా ఉండగా, భారత్‌లో ఎరువుల లభ్యత ఎక్కువగా దిగుమతులపై ఆధారపడి ఉన్నది. గతేడాది దిగుమతి చేసుకున్న యూరియా దేశంలో అందుబాటులో ఉన్న మొత్తం ప్రాంతంలో దాదాపు 21 శాతం వాటాను కలిగి ఉన్నది. డీఏపీ సంబంధిత వాటా 55 శాతం. ఎంఓపీ దాదాపు 100 శాతంగా ఉన్నది. కొన్నేండ్లలో భారత్‌కు డీఏపీ అత్యంత ముఖ్యమైన ఎగుమతిదారుగా చైనా ఉద్భవించింది. ప్రపంచవ్యాప్తంగా, చైనా మొత్తం డీఏపీ వాణిజ్యంలో దాదాపు మూడింట ఒక వంతు, యూరియాలో పదో వంతు వాటాను కలిగి ఉన్నది. గతేడాది, మొత్తం భారత డీఏపీ దిగుమతుల్లో 40 శాతం చైనా నుంచి జరిగింది. డిసెంబర్లో ఇంధన సంక్షోభం కారణంగా చైనా జూన్ 2022 వరకు డీఏపీ ఎగుమతులను నిలిపివేసింది. అలాగే, చైనా-భారత్‌ల మధ్య నెలకొన్న పరిస్థితులు, మోడీ సర్కారు వ్యవహరించిన తీరు ఎరువుల విషయంలో రైతులకు శాపంగా మారిందని విశ్లేషకులు తెలిపారు.